సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా ముద్రించిన ప్రచార పోస్టర్‌ను శనివా రం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్రమత్తతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930కు సమాచారమందించాలని సూచించారు. గంటలోపు ఫిర్యాదు చేసిన వారి నగదు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా థర్డ్‌పార్టీ అప్లికేషన్లను వినియోగిస్తూ మొబైల్ ఫోన్‌లో వాటికి అనుమతులు ఇవ్వడంతో డాటా చోరీకి గురవుతుందన్నారు. వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి బ్లాక్ మెయిల్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియాలో జాబ్‌ఫ్రాడ్, వర్క్‌ఫ్రం హోం, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, బిజినెస్ ఫ్రాడ్, ఏఐ ఆధారిత వీడియో సందేశాలతో కూడిన ఫ్రాడ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు జరుగుతున్నట్లుగా తెలిపారు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


