బాల మేధస్సు భళా!
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టారు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు పునాది వేసుకున్నారు. నూతన ఆవిష్కరణలు తయారు చేసి ఔరా అనిపించారు. పర్యావరణం, ప్రమాదాలు, కాలుష్య నివారణ, పనికి రాని వస్తువులతో ఉపయోగాలు ఇలా అనేక అంశాలతో వినూత్న రీతిలో ప్రాజెక్ట్‌లు రూపొందించారు. మానవాళికి ఉపయోగపడే విధంగా నమూనాలు ప్రదర్శించారు. వాటిని తిలకించిన వారు బాల మేధావులు.. భళా అంటూ అభినందించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చి ప్రదర్శించారు. శనివారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చే నెల 6, 7, 8వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు తయారు చేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్నారు. సైన్స్, గణితం అంటే భయం పొగొట్టేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో ఎస్.రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, సైన్స్ అఽఽధికారి ఆరె భాస్కర్, సెక్టోరల్ అధికారులు రఘురమణ, తిరుపతి, సుజాత్‌ఖాన్, ఎంఈఓ సోమయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొమ్ము కృష్ణకుమార్, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


