రైల్వేలైన్ డీపీఆర్ ఆమోదించండి
నిర్మల్: నిర్మల్ జిల్లా మీదుగా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్‌కు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) పూర్తయిందని, త్వరగా ఆమోదించా లని ఆదిలాబా ద్ ఎంపీ నగేశ్ రైల్వేబోర్డును కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో శనివారం రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌ను కలిశారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ కోసం దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్ పూర్తిచేసి బోర్డుకు పంపిందని తెలిపారు. ఈ నివేదికను త్వరగా ఆమోదించాలని విన్నవించారు. రెబ్బెన వద్ద ఎల్‌సీ–71 రోడ్ ఓవర్ బ్రిడ్జి కోసం టెండర్లను ప్రారంభించాలని కోరారు. డీపీఆర్ ఆమోదంపై రైల్వేబోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ నగేష్ తెలిపారు.
ఇప్పుడే కీలకం
జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణంలో ఇదే కీలక ప్రక్రియ. మూడు జిల్లాలను కలుపుతూ 136.50కిలోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిర్మాణానికి రూ.4,300కోట్ల అంచనాతో డీపీఆర్ పూర్తి చేశారు. ఇందులో రైల్వేబోర్డు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం పంపిస్తే ఇక రైల్వేలైన్‌కు పచ్చజెండా ఊపినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు.


