కాపీయింగ్‌కు ఇక చెక్
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిఘా నీడలో సాగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ప్రైవేట్‌లోనూ ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇదివరకు కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో నామమాత్రంగా ప్రాక్టికల్ చేసినా మార్కులు అధికంగా వేసేవారు. అలాంటి వాటికి ఇక చెక్ పడనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 2 నుంచి పరీక్షలు..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో ఈ సారి ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో పాఠశాలలు కొనసాగుతుండడంతో ఆ విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అక్కడ ప్రాక్టికల్ నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు.
నిఘా ఇలా..
ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఇంటర్మీడియెట్ బోర్డు కంట్రోల్ కమాండ్‌కు అనుసంధానం అయి ఉన్నాయి. ఇక్కడి ప్రతీ దృశ్యాన్ని వారు వీక్షించి పర్యవేక్షించనున్నారు. అలాగే ఒక్కో ప్రైవేట్ కళాశాలలో ఐదేసి చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 4 ల్యాబ్‌లకు ఒక్కోటి చొప్పున, కారిడార్‌లో మరొకటి ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నాయి. ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. దీనిని జనవరి 21న నిర్వహించనున్నారు. అలాగే ఫస్టియర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైతం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌బోర్డు సన్నద్ధమవుతుంది. ఈ సారి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షణ కోసం డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వరకు కొనసాగనున్నాయి. ఈ సారి సీసీ నిఘాలో నిర్వహించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ సెక్టార్ కళాశాలల్లో ప్రాక్టికల్ సెంటర్లు ఉండవు. ఈ విద్యార్థులు సంబంధిత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌కు సంబంధించిన మెటీరియల్‌ను ప్రభుత్వం పంపిణీ చేసింది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతాం.
– జాదవ్ గణేశ్‌కుమార్, డీఐఈవో
జిల్లాలో..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 13
ఇందులో ఏర్పాటు చేసిన
సీసీ కెమెరాలు : 165
ప్రైవేట్ కళాశాలలు : 19
ఒక్కో కళాశాలలో ఏర్పాటు
చేయనున్న సీసీ కెమెరాలు : 05
ప్రభుత్వ సెక్టార్ కళాశాలలు : 44
ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 9,212
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 9,150
కాపీయింగ్‌కు ఇక చెక్


