
‘నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలి’
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం మార్క్స్‌భవన్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన పురాణాలపై ఆధారపడి నూతన జాతీయ విద్యావిధానాన్ని రాసినట్లు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వర్ణ వ్యవస్థ ఆధారిత విద్యను అమలు పరిచేందుకు ఉవ్విళ్లూరుతోందని ఆరోపించారు. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశ జీడీపీలో 2.5 శాతం మాత్రమే విద్యకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి మాటమార్చిందన్నారు. అంతకుముందు పీడీఎస్‌యూ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శ్రీకాంత్ ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగరాజు, తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్, పీడీఎస్‌యూ జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు, రాజేశ్వర్, కిరణ్, సహాయ కార్యదర్శులు గౌతమ్‌కుమార్, మస్తాన్, నవీన్, అజయ్, తిరుపతి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి చరణ్, డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.