
లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు
జైనూర్: సద్గురు పూలాజీబాబా తన హితబోధనలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం మండలంలోని పట్నాపూర్‌లోని సిద్ధేశ్వర సంస్థాన్‌లో పూలాజీబాబా 101వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఆధ్మాత్మిక మార్గం వైపు నడిపించిన ఘనత బాబాకే దక్కుతుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాయన్నారు. అనంతరం మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రచించిన బాబా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిన్వట్ ఎమ్మెల్యే భీంరావ్ కేరామ్, మహారాష్ట్ర మాజీమంత్రి శివాజీరావు, మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావు ఇంగ్లే, మహారాష్ట్ర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాందాస్, ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఆదిలాబాద్ డీఎస్పీ రఘునాథ్, రెవెన్యూ జిల్లా అధికారి లోకేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ ఆడే శేషేరావు పాల్గొన్నారు.