
గణేశ్ ఉత్సవాలకు గట్టి బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో పోలీసు అధికారులతో ఉత్సవాల నిర్వహణ, బందోబస్తుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రోత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్‌టౌన్, టూటౌన్, మావల స్టేషన్ల పరి ధిలో 11 సెక్టార్లుగా విభజించి బందోబస్తు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలు నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ గణపతి మండపాన్ని జియోట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 11 రోజుల పాటు పికెట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఎలాంటి అసత్యప్రచారాలు జరగకుండా సోషల్ మీడియా బృందం పర్యవేక్షిస్తుందని, ఎవరు చూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐలు తదితరులు పాల్గొన్నారు.