
ఆర్జీయూకేటీలో ముగిసిన వర్క్‌షాప్
బాసర:బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై మూడు రోజులు నిర్వహించిన హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్ సోమవారం ముగిసింది. నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సహకారం అందించిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ప్రపంచం వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పయనిస్తున్న ఈ సమయంలో ఆర్జీయూకేటీ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, ప్రయోజనాత్మక అనుభవం అందించడం అత్యంత అవసరమన్నారు. ఇలాంటి వర్క్‌షాప్‌లు కేవలం శిక్షణ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆవిష్కరణలకు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు సహా మొత్తం 75 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. దేశ స్వచ్ఛ శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలకు తోడ్పడే విధంగా నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్‌షాప్ దోహదపడిందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మణ్ ముత్యం, హెచ్‌వోడీ డాక్టర్.బావుసింగ్, అధ్యాపకులు పాల్గొన్నారు.