
క్రీడలతో ఆరోగ్యకర సమాజం
ఆదిలాబాద్: క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన క్రీడా దినోత్సవ ర్యాలీని ఆమె ప్రారంభించారు. జ్యోతి వెలిగించి క్రీడాకారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలపై విస్తృత అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 23నుంచి 31వరకు క్రీడా దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టిందన్నారు. వీటిలో క్రీడాకారులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇందులో డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, క్రీడా శిక్షకులు రాజు, కబీర్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.