
నో స్టాక్!
యూరియా కోసం ఆగ్రోస్ కేంద్రం ఎదుట గురువారం బారులు తీరిన రైతులు
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో మూడు రోజుల క్రితం యారియా వచ్చింది. ఈ క్రమంలో రైతులు గురువారం కేంద్రం ఎదుట ఇలా బారులు తీరారు. అయితే ఆ రోజు కొంతమందికి మాత్రమే ఎరువు లభించింది. గంటల తరబడి నిరీక్షించినా చాలా మందికి నిరాశే ఎదురైంది. శుక్ర, శని రెండు రోజులు ఈ కేంద్రానికి రైతులు ఉదయం నుంచే వస్తున్నా నోస్టాక్ కారణంగా దుకాణం మూసి ఉండడంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు.
ఇచ్చోడ: ఈసీజన్‌లో జిల్లావ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం పత్తి, సోయా మొక్కలు ఏపుగా పెరిగే దశకు చేరుకున్న తరుణంలో ఎరువు అవసరం ఉంటుంది. ఈ క్రమంలో రైతులు ప్రాథమిక సహకార సంఘాలు, అగ్రో సేవాకేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నా రు. అయితే చాలాచోట్ల స్టాక్ లేకపోవడం, కొన్ని చోట్ల ఉన్నా సరిపడా లేకపోవడంతో గంటల తరబ డి క్యూలో నిరీక్షిస్తున్నారు. తమ వంతు వచ్చేవరకు అయిపోవడంతో పలువురికి నిరాశ తప్పడం లేదు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా కేవలం పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు కృషి సేవా కేంద్రాలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అలాట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆయా కేంద్రాల ఎదుట వేకువజాము నుంచే రైతులు బారులు తీరుతున్నారు. అయితే కొద్ది సేపటికే నోస్టాక్ బోర్డు దర్శనమిస్తుందని,సాగు పనులు సైతం వదులుకుని వచ్చి గంటల తరబడి నిరీక్షించినా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. మరోవైపు సెప్టెంబర్ వరకు జిల్లాకు 36వేల మెట్రిక్ టన్నుల యూరియా అవస రం ఉండగా.. ఇప్పటి వరకు 30వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రకారం చూస్తే యూరియా కొరత ఉండొద్దు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
కొరత లేదు
జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రతీ నెల అవసరం మేరకు పీఏసీఎస్‌లకు సరఫరా చేస్తున్నాం. అవసరం లేకున్నా కొంత మంది రైతులు అదనంగా కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో యూరియా సరఫరా వివరాలు..
సెప్టెంబర్ వరకు అవసరం :
36వేల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు సరఫరా అయినది :
30వేల మెట్రిక్ టన్నులు

నో స్టాక్!