
వినాయకా.. తిప్పలు తప్పేనా
కై లాస్‌నగర్: గణేశ్ నవరాత్రోత్సవాలకు సమయం ఆసన్నమైంది. పట్టణంతో పాటు చుట్టు పక్కల మ ండలాల్లో ఏర్పాటు చేసే మండపాలకు జిల్లా కేంద్రం నుంచే వినాయక విగ్రహాలను తీసుకెళుతుంటారు. అయితే పట్టణంలోని ప్రధానరోడ్లతో పాటు అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర లేచి గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. దీంతో విగ్రహాలు తరలించేందుకు తిప్పలు తప్పేలా కన్పించడం లేదు. మరమ్మతులు చేపట్టాల్సిన బల్దియా యంత్రాంగం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
గుంతలమయమైన రహదారులు
జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీకి సంబంధించిన ప్రధాన రోడ్లతో పాటు బల్దియాకు సంబంధించిన అంతర్గత రోడ్లు పలు కాలనీల్లో అధ్వానంగా మారాయి. కొన్నేళ్లుగా వీటికి ఎలాంటి మరమ్మతులు చేపట్టడం లేదు. బీటీ రోడ్లపై తారు లేచి కంకర తేలగా, సిమెంట్ రోడ్లపై సైతం గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో నీరు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరమ్మతు చేపట్టాల్సిన అధికారులు నిధుల కొరత సాకు చూపుతుండడం గమనార్హం.
సమీపిస్తున్న గడువు
ఈ నెల 27న వినాయక చవితి. గణేశ్ విగ్రహాలను జిల్లా కేంద్రంలోనే భారీగా తయారు చేశారు. పట్టణంతో పాటు తాంసి, తలమడుగు, జైనథ్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల గణేశ్ మండళ్ల నిర్వాహకులు ఇక్కడి నుంచే విగ్రహాలను తరలిస్తుంటారు. అయితే పట్టణంలోని పలు రోడ్లు గుంతలమయంగా మారడంతో వాటి తరలింపునకు ఇబ్బందిగా మారే అవకాశముంది. కాగా, ఇటీవల నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులతో పాటు పలు గణేశ్ మండళ్ల నిర్వాహకులు సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పటికిప్పుడు పనులు చేపట్టే అవకాశం కనిపించడం లేదు.
త్వరలోనే మరమ్మతు పనులు..
నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. త్వరలోనే రోడ్ల మరమ్మతు పనులు చేపడుతాం. అలాగే ఆయా కాలనీల్లో వీధి దీపాలు సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తాం. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
చర్యలు చేపడతాం. – కార్తీక్, మున్సిపల్ డీఈ

వినాయకా.. తిప్పలు తప్పేనా