
● జిల్లాలో ఆ శాఖకు ఎనిమిది కొత్త పోస్టులు ● మంజూరు చేసి
కైలాస్‌నగర్: జిల్లా పాలనలో ముఖ్య ప్రణాళిక శాఖ (సీపీవో) కీలకమైంది. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదును ఎప్పటికప్పుడు లెక్కించి కలెక్టర్, ఉన్నతాధికారులకు నివేదికలు అందించడంతో పాటు వ్యవసాయ శాఖ చేపట్టే పంటల గణనలోనూ ఈ శాఖ ప్రధాన పాత్ర నిర్వర్తిస్తోంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు అందించే నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలను ఆమోదించడంతో పాటు వాటి బిల్లుల చెల్లింపులోనూ ఈ శాఖనే ముఖ్యపాత్ర పో షిస్తోంది. ఇంతటి కీలకమైన శాఖలో ప్రస్తుతం అధి కారులు, ఉద్యోగుల కొరత ఉంది. ఈ క్రమంలో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. తద్వారా సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖను పటిష్టం చేయాలని భావించింది. జిల్లాకు అదనంగా ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు త్వరలోనే విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. తద్వారా శాఖ పటిష్టం కావడంతో పాటు సేవలుసైతం మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఉమ్మడి జిల్లాలో కీలకపాత్ర..
జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన నివేదికలు రూపొందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే సీడీపీ, ఎంపీ ల్యాడ్స్, ఎస్‌డీఎఫ్, సీబీఎఫ్ నిధులతో చేపట్టే పనులకు బిల్లుల చెల్లింపులో ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయమే కీలకం. వాటితో పాటు వ్యవసాయ శాఖ చేపట్టే పంటల గణన, వర్షపాతం నమోదు పనులను సైతం ఈ శాఖనే నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్న సమయంలో ఈ కార్యాలయం ఓ వెలుగు వెలిగింది. కాంట్రాక్టర్లు, రాజకీ య నాయకులు, అధికారుల సందర్శనతో నిత్యం సందడిగా ఉండేది. జిల్లాల పునర్విభజనతో ఆ ప్రభావం కోల్పోయినప్పటికీ శాఖాపరమైన విధులు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి కార్యాలయంగా ఉన్న అధికారులు, ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజించిన ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీంతో అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఫలితంగా ఉన్న వారిపైన అదనపు భారం పడుతుంది.
జిల్లాకు మంజూరైన పోస్టులు..
కేటగిరి పోస్టుల సంఖ్య
జేడీ/డీడీ 01
ఏడీ 01
స్టాటిస్టికల్ ఆఫీసర్ 02
డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ 04
ప్రస్తుతం సీపీవో కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒకరు చొప్పున ఉండగా ఇద్దరు మినిస్టీరియల్ ఉద్యోగులు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వర్షపాతం, సీడీపీ, ఎంపీ ల్యాడ్స్, సీబీఎఫ్, ఎస్‌డీఎఫ్ వంటి పనులన్నింటినీ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పర్యవేక్షించాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఈ విధులను స్టాటిస్టికల్ ఆఫీసర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. 2016 నుంచి ఈ శాఖలో ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారితోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. దీంతో వారిపై పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు. అనారోగ్యం, ఏదైనా పని మీద సెలవుపై వెళ్లాల్సి వస్తే కార్యాలయ విధులకు అంటంకం కలిగే పరిస్థితి. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ కార్యాలయానికి 8 కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీటిని పదోన్నతులు, కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలో భర్తీ అయ్యే అవకాశం
జిల్లాకు కొత్తగా ఎనిమిది పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది. వారు విధుల్లో చేరితే కార్యాలయ పనితీరు మెరుగుపడటంతో పాటు సకాలంలో సేవలు అందించే అవకాశముంటుంది. – వెంకటరమణ,
ముఖ్య ప్రణాళికశాఖ జాయింట్ డైరెక్టర్

● జిల్లాలో ఆ శాఖకు ఎనిమిది కొత్త పోస్టులు ● మంజూరు చేసి