
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ మేరకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఓ సైబర్ వారియర్‌ను నియమించినట్లు తెలిపారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో 19 స్టేషన్లలో సైబర్ విధులు నిర్వహిస్తున్న వారియర్స్‌కు శుక్రవారం ప్రత్యేక టీ షర్ట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సిబ్బంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసుల దర్యాప్తు కొనసాగించాలన్నారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించినప్పుడే పోలీసు వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని సూచించారు. ఇందులో సైబర్ క్రైం డీఎస్పీ హసీబుల్లా తదితరులు పాల్గొన్నారు.