
పార్వతి తనయా
పర్యావరణహితాయ..
ఆదిలాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు గణనాథుని ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రం వ్యాప్తంగా మట్టి ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎంతోమంది కళాకారులకు ఉపాధి అందిస్తున్నాయి. వైవిధ్యమైన రూపాల్లో పార్వతి తనయున్ని పర్యావరణహితంగా ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి వినాయక ప్రతిమలను నిలబెట్టేందుకు యువత, ఉత్సవ సమితి సభ్యులు ప్రాధాన్యతనిస్తుండడం విశేషం. పీఓపీ విగ్రహాలు తక్కువ సమయంలో పూర్తవుతాయి. మట్టి ప్రతిమల తయారీకి 10 నుంచి 20 రోజులు పడుతుంది. అయినప్పటికీ నిర్వాహకులు వైవిధ్యమైన రూపాల్లో మట్టి వినాయకున్ని కొలువుదీర్చేందుకు ఆర్డర్లు ఇస్తుండడం గమనార్హం. దీంతో కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ సైతం సాధ్యమవుతుండడంతో పర్యావరణ ప్రేమికుల నుంచి సైతం హర్షం వ్యక్తం అవుతుంది.