
చికిత్స పొందుతూ యువతి మృతి
నిర్మల్ రూరల్: మండలంలోని చిట్యాల గ్రామం వద్ద రాఖీ పండుగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అర్చన (18) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లికి చెందిన మహేశ్ వరుసకు చెల్లెళ్లయిన అర్చన, ఆద్యతో కలిసి జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న అర్చన చెల్లెలు అక్షయతో రాఖీ కట్టుకునేందుకు బైక్‌పై బయలుదేరారు. చిట్యాల వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మహేశ్, ఆద్యకు స్వల్ప గాయాలు కాగా.. అర్చనకు తీవ్రగాయాలయ్యాయి. అర్చన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అర్చన ఇంటర్ పూర్తి చేసి ఇటీవలే హైదరాబాద్‌లో బీటెక్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందింది. మరో వారంరోజుల్లో కాలేజీలో జాయిన్ కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదానికి కారణమైన వాహనం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన ఓ వ్యక్తిదిగా రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణాశాఖ అధికారికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్‌కు చెందిన కుక్కల రాకేశ్ (21) ఇద్దరు స్నేహితులతో కలిసి నిజామాబాద్‌కు వెళ్లి తిరిగి రామకృష్ణాపూర్‌కు కారులో వస్తుండగా హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వేంపల్లి శివారులోగల కల్వర్టును అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాకేశ్‌కు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి వివాహం కాలేదు. అతని తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండా
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్‌వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు.