
కడెం కెనాల్‌లో పడి ఒకరు మృతి
దండేపల్లి: మద్యం మత్తులో కడెం కెనాల్‌లో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సేదం నర్సయ్య (48) కూలీ పని నిమిత్తం దండేపల్లి మండలంలోని కుంటలగూడకట్టకు చెందిన తన బంధువైన బొబ్బిలి బక్కవ్వ ఇంటికి వచ్చాడు. మంగళవారం మద్యం సేవించి కడెం కెనాల్ సమీపంలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆతరువాత కొద్దిసేపటికి అతను కనిపించక పోవడంతో బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా బుధవారం కుంటలగూడకట్ట సమీపంలోని కడెం కెనాల్ లో చెట్లపొదలకు తట్టుకుని మృతదేహం దొరికింది. మద్యం మత్తులో ప్రమాద వశాత్తు కెనాల్‌లో జారిపడడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని బంధువు భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.