మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది.. అప్పటి రాజకీయ నాయకులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నారు..’ ఈ మాటలన్నది కొత్త సీఎస్ కె.రామకృష్ణారావు. ఏప్రిల్ 18న భూభారతి అవగాహన సదస్సు కోసం రాష్ట్ర మంత్రులు జిల్లాలోని భోరజ్ మండలం పూసాయి గ్రామానికి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో రామకృష్ణారావు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వేదిక పైనుంచి ఆయన జిల్లాతో అనుబంధాన్ని పంచుకున్నారిలా.
– సాక్షి,ఆదిలాబాద్
కొత్త సీఎస్‌గా నియమితులైన కె.రామకృష్ణారావుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన 2000 సంవత్సరం జూలై 7 నుంచి 2002 అక్టోబర్ 25 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్లకు పైగా జిల్లాలో విధులు నిర్వహించిన ఆయన ఈ ప్రాంతవాసులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండగా, ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యే వారు. దీంతోనే ఆయన ఇక్కడినుంచి వెళ్లిపోయి ఏళ్లు దాటినా ప్రజలు ఇప్పటివరకు గుర్తుంచుకున్నారంటే ఆ అనుబంధమే కారణం.
అభివృద్ధికి తోడ్పాటు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు ఆయన తోడ్పాటునందించారు. ప్రధానంగా అప్పట్లో జిల్లా కేంద్రానికి తొలిసారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసింది రామకృష్ణారావు హయాంలోనే. అప్పట్లో జిల్లా మీదుగా విస్తరించి ఉన్న జాతీయ రహదారి నం.7 ఒక వరుస రహదారిగా ఉండేది. ఆ సమయంలో నిర్మల్ జిల్లా వద్ద వేకువజామున ఓ భారీ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కేంద్రం నుంచి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల సహాయార్థం ఆయన తీసుకున్న చొరవ ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటారు. అలాగే జిల్లాలో వరదలు పోటెత్తిన సమయంలో కారు వెళ్లలేని గ్రామాల్లో ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్లి వరద బాధితుల సహాయార్థం చర్యలు తీసుకున్నారు. ఈవిధంగా రామకృష్ణారావు జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆయన కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి వస్తున్నారు.
ఉమ్మడి జిల్లాతో రామకృష్ణారావుకు అనుబంధం
23 ఏళ్ల క్రితం ఇక్కడే విధులు
ఇటీవల ‘భూ భారతి’ సదస్సుకు హాజరు
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్


