మాతాశిశు మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు సంకల్ప్ కార్యక్రమంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఇందులో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ మరణాలు నివారించేందుకు గర్భం దాల్చిన వెంటనే పీడీ వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. శిశు సంరక్షణలో భాగంగా పుట్టిన గంటలోపు పసికందుకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీని వాస్, సంకల్ప్ కార్యక్రమ నోడల్ అధికారి తన్నిజై, వైద్యాధికారులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం తనిఖీ చేశారు. పోలీసు, సఖీ, ఎన్జీవో, రిమ్స్ ప్రతినిధులతో ఏర్పాటైన బృందాలతో ఆస్పత్రుల్లో వసతులు, వైద్యం వివరాలు, లింగనిర్ధారణ, ఫైర్‌సేఫ్టీ, రిజిస్ట్రేషన్ తది తర వాటిని పరిశీలించారు. నక్షత్ర ఆస్పత్రిలో ఏఎన్‌సీ చెకప్ చేయడం లేదని తెలుసుకున్న డీఎంహెచ్‌వో ఫ్రోమ్ సీజ్ చేసి కస్టడీలో పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రిజిస్టర్ అయిన ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులు, వారి సహాయకులకు కనిపించేలా ఆస్పత్రిలో ధరల పట్టికలు ప్రదర్శించాలన్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఫైర్‌సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట యశోద, సరస్వతి, వైద్య సిబ్బంది ఉన్నారు.


