
పొట్టపెల్లి(కె)కి తప్పిన ప్రమాదం
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వరిగడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. గాలి వేగానికి క్షణాల్లో మంటలు గ్రామ సమీపం వరకు వ్యాపించాయి. బీసీ కాలనీకి పది అడుగుల దూరం వరకు మంటలు వచ్చాయి. ఇళ్లకు నిప్పు అంటుకుంటుందని పలువురు యువకులు, పెద్దలు ధైర్యం చేసి చెట్లకొమ్మలు, బిందెలు, బకెట్లలో నీటితో మంటలార్పేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకున్నారు. యువకులు, గ్రామస్తుల సహాయంతో మంటలార్పేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 2 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదంతో పలువురు రైతులకు చెందిన వరిగడ్డి దగ్ధమైంది. దాదాపు రూ.30 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది ఏఎస్సై అశోక్ కుమార్, డ్రైవర్ ఆపరేటర్ హుస్సేన్, ఫైర్‌మెన్‌లు అజయ్ కుమార్, రాజు, ఏఎస్పై నారాయణరెడ్డి, పీసీలు అశోక్, తదితరులు ఉన్నారు.
వరిగడ్డికి నిప్పుపెట్టిన
గుర్తుతెలియని వ్యక్తులు
క్షణాల్లో వ్యాపించిన మంటలు
మంటలార్పిన యువకులు, అగ్నిమాపక సిబ్బంది

పొట్టపెల్లి(కె)కి తప్పిన ప్రమాదం