ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్‌గూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మహేశ్వరి మృతిపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీసింది. బాలిక జ్వరంతో మృతి చెందడంపై ఆగ్రహించిన ఆది వాసీలు జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంపై స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. బాలిక జ్వరంతో మృతి చెందిందా? ఇతర కారణాలున్నాయా? జ్వరం వచ్చినా పాఠశాల సిబ్బంది ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు? వంటి అంశాలతో కూడిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను సంప్రదించగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని తెలిపారు.