● 4,081 మంది ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులు ● బీసీలు 757 మంది మాత్రమే ● బీసీ విద్యార్థులకు గతేడాది జమకాని నిధులు
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. వీటిలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, గిరిజన, అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖలు ప్రధానమైనవి. ప్రభుత్వ ఆర్థికసాయం పొందుతున్న విద్యార్థులు ఉన్నత చదువులపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినా జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 31లోగా విద్యార్థులు దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని అధికారులు కోరుతున్నారు.
రూ.1000 నుంచి రూ.3వేల వరకు..
6 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాలురకు రూ. 1000, బాలికలకు రూ. 1500 చొప్పున చెల్లిస్తారు. 9, 10 తరగతులు చదివే పిల్లలకు ఏడాదికి రూ. 3 వేల చొప్పున ఉపకార వేతనం అందజేస్తారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 4,081 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
బీసీ విద్యార్థులకు రూ.వెయ్యి
సర్కారు బడుల్లో బీసీ విద్యార్థులకు ఆ శాఖ ద్వారా ప్రభుత్వం 9, 10 తరగతుల వారికి రూ.వెయ్యి అందజేస్తోంది. ఈ విద్యా సంవత్సరం 757 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా గత విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు ఇప్పటికి జమా కాకపోవడంతో ఉపకార వేతనానికి చాలామంది దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోస్టు మెట్రిక్ చదువుతున్న బీసీ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో 10,243 మంది ఆన్‌లైన్‌లో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా 6,689 మందికి మంజూరు చేసినట్లు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మిగతా విద్యార్థులకు సంబంధించిన కళాశాలల యాజమాన్యాలు హార్డ్‌డిస్క్‌లు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌లు సకాలంలో కార్యాలయానికి సమర్పించకపోవడంతో మంజూరు కాలేదని చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులున్నారు. ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆయా పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్య ప్రతినిధులు, విద్యార్థులు నమోదు చేసుకునేలా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈపాస్ వెబ్‌సైట్‌ను తెరిచి వివరాలను నమోదు చేయాలి. అనంతరం కళాశాల బోనఫైడ్, కులం, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేసి శాఖల అధికారులకు అందజేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం, గ్రామీణ ప్రాంత వారికై తే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికై తే రూ. 2 లక్షలకు మించని వారు ఉపకార వేతనానికి అర్హులుగా పరిగణిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేస్తోంది. అవి చదువులకు ఉపయోగపడతాయి. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
– సునీత కుమారి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి
8, 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే..
1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అల్ప సంఖ్యాక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం గతంలో ఉపకార వేతనాలు అందజేసేది. జిల్లాలోని సు మారు 6 వేల నుంచి 7 వేల మందికి ప్రయోజనం కలిగేది. కాని ఈ విద్యాసంవత్సరం మాత్రం 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే అందజేస్తోంది. ఆయా తరగతుల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రతి విద్యా సంత్సరంలో ఫిబ్రవరిలో డబ్బులు విద్యార్థుల ఖా తాలో జమా అయ్యేవి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమా కాలేదని వారు ఆందోళన చెందుతున్నారు.


