sivadhar reddy
-
ఐపీఎస్‌గా శివధర్ రెడ్డివి విశిష్ట సేవలు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిగా బి.శివధర్‌రెడ్డి అందించిన సేవలు విశిష్టమైనవని డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కొనియాడారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కీలక బాధ్యతల్లో ఆయన పనిచేశారన్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో పనిచేసిన నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. గురువారం శివధర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో గౌరవసూచకంగా ప్రత్యేక పరేడ్ కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పోలీస్ అధికారిగా 32 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజ లకు అమూల్యమైన సేవలందించారన్నారు. నక్సల్ సమ స్యను ఎదుర్కోవడంలో జిల్లా ఎస్పీగా, ఎస్ఐబీ అధికారిగా కీలకపాత్ర వహించారని చెప్పారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లతోపాటు లొంగుబాట్లలోనూ కీలకంగా ఉన్నారన్నారు. సాంకేతికతను వాడటంలో తెలంగాణ పోలీసు దేశంలో ముందంజలో ఉందన్నారు.ఇప్పుడు డ్రగ్స్, సైబర్‌నేరాలు, ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, వీటిని ఎదుర్కొనేందుకు పోలీస్‌శాఖ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, వృత్తిగత జీవితంలో ప్రోత్సహించిన, తన విజయాల్లో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పోలీస్, ప్రజలకు మధ్య వచ్చిన అంతరాన్ని తగ్గించేందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకున్నామని గుర్తు చేశారు. యువ అధికారులు పోలీస్‌శాఖకు పేరు తేవాలని సూచించారు. సాదరంగా వీడ్కోలురాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా నిర్వహించిన వీడ్కోలు వేడుక ఆత్మీయతతో కూడిన వాతావరణంలో సాగింది. కార్యక్రమ ఆరంభంలో శివధర్‌రెడ్డి తన బాధ్య తలను శాంతిభద్రతల డీజీ మహేశ్ ఎం. భగవత్‌కు అప్ప గించారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు, ఇన్చార్జి డీజీపీగా మహేశ్ భగవత్ వ్యవహరించనున్నారు.అధికారిక బదిలీ ప్రక్రియ అనంతరం, వీడ్కోలు పలికేందుకు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో నిలబడి, అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. పోలీసు సంప్రదాయం ప్రకారం ఐపీఎస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ కార్యాలయ ప్రధాన ద్వారం వరకు సాగనంపారు. కార్యక్రమంలో టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయకుమార్‌తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నో కీలక వ్యూహాలతోనే నక్సలిజం అంతం
⇒ మొదట్లో నక్సలిజం అనేది కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం చూసింది. కానీ ఇది సామాజిక, రాజకీయ కోణాలు, ఆర్థిక అసమానతలు, సిద్ధాంతాలతో ఇమిడి ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగానే చర్యలు ప్రారంభించింది.⇒ సాంకేతికతను వాడుతూనే బేసిక్ పోలీసింగ్‌ను మరవొద్దు. కేవలం సీసీటీవీలు, టెక్నాలజీపైనే ఆధారపడకుండా ప్రజలతో మమేకమైతేనే పోలీసింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. ⇒ 2025లో హత్యలతో 800 మంది చనిపోతే రోడ్డు ప్రమాదాల్లో 2,500 మందికిపైగా చనిపోయారు. అకారణంగా ఏటా ఇంత మంది చనిపోవడం బాధాకరం. పని మీద బయటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి?⇒ పబ్లిసిటీ కోసం మన పనులు ఉండొద్దు. పబ్లిక్ కోసం పనిచేస్తే పబ్లిసిటీ అదే వస్తుందన్న విషయాన్ని మరవొద్దు. ⇒ పోలీసులకు ఇంటిగ్రిటీ ముఖ్యం..ఎవరూ చూడనప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండాలి. హీరోయిజం కోసం కాకుండా రియల్‌గా సేవచేయాలి. సాక్షి, హైదరాబాద్: బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్లడంతోనే నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసి.. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ, మహిళా రిజర్వేషన్ల కల్పన, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సైతం ప్రజలపై ప్రభావం చూపాయని.. ఈ అంశాలు సైతం నక్సలిజం అంతానికి దోహదపడ్డాయని చెప్పారు.ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరినప్పటి నుంచి డీజీపీగా పదవీ విరమణ పొందే వరకు వృత్తిగతంగా ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు. డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమితులైన సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో శివధర్‌రెడ్డి మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. వ్యూహాత్మక నిర్ణయాలతోనే... నక్సలిజం ఎంతో ప్రభావంతంగా ఉన్న పరిస్థితిని నుంచి తాజా పరిస్థతుల వరకు అన్ని స్థాయిల్లో నేను చూశాను. మొదట్లో నక్సలిజాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం చూసింది. కానీ ఇది సామాజిక, రాజకీయ కోణాలు, ఆర్థిక అసమానతలు, సిద్ధాంతాలతో ఇమిడి ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్నాక అందుకు తగ్గట్టుగానే చర్యలు ప్రారంభించింది. తొలుత ఎస్ఐబీ, గ్రేహౌండ్స్‌ను స్థాపించడం.1993లో తెచ్చిన సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ, స్థానిక సంస్థల్లో బీసీ, మహిళా రిజర్వేషన్లతో కొన్ని వర్గాలు రాజకీయంగా ఎదగడం, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అడ్డుకునేందుకు తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ పక్కాగా అమలు చేయడంతో ఆ వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగడం.. పెత్తందారుల ఒత్తిళ్లు తగ్గడం.. ఇలా రాజకీయ, సామాజిక మార్పులతో చాలా వర్గాలు నక్సలిజానికి దూరమయ్యాయి. మరోవైపు పోలీసు ఆపరేషన్లు పెరగడంతో 2007 నాటికే తెలంగాణలో మావోయిజం తగ్గింది. అప్పుడప్పుడు ఉనికి చాటుకున్నా.. యాక్టివిటీ ఏమీ లేదు. ఆ తర్వాత వేగంగా క్షీణించింది. వైఎస్సార్ కీలక నిర్ణయాలతో ప్రభావం 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వృద్ధులు, బీడీ కారి్మకులు, వికలాంగులకు పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ పథకం ఇలా అనేక నిర్ణయాలూ సమాజంలో మార్పు తెచ్చాయి. ప్రభుత్వాలు మనకోసం పనిచేస్తున్నాయి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అ లాంటప్పుడు నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాలన్న ప్రశ్న ప్రజల్లో వచ్చింది. అది కూడా నక్సలిజం అంతానికి పనిచేసింది. డీజీపీగా రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిచ్చా.. నేను డీజీపీగా ఏడు నెలల్లో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు ఫెయిర్, ఫర్మ్, ప్రొఫెషనల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. అన్నింటితోపాటు నేను రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. దీంతో ఈ ఏడాదిలో నాలుగు నెలల్లో 400 రోడ్డుప్రమాద మరణాలు తగ్గించాం. రాజకీయ జోక్యం తగ్గిస్తున్నాం పోలీసుల పోస్టింగ్‌లు, రోజువారీ పనుల్లో గతంతో పోలిస్తే రాజకీయ జోక్యం తగ్గిస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సు లెటర్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. ఆ అధికారి సమర్థత, గతంలో చేసిన సర్విస్‌ను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ ఆ అధికారి సమర్థుడు కాకపోతే వెంటనే సదరు ప్రజాప్రతినిధికి చెబుతున్నాం. గతంతో పోలిస్తే పోలీసు విధుల్లో, కేసుల నమోదులో రాజకీయ జోక్యం బాగా తగ్గించగలిగాం. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పోలీసు అధికారి కాగానే మనం ఏదో సాధించేశాం అన్నట్టుగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎన్నో సమస్యలతో బాధితులు మన దగ్గరికి వస్తుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం మన పరిధిలో ఉండకపోవచ్చు. అయినా సరే వాళ్ల సమస్యను సావధానంగా వినాలి. అప్పుడు వాళ్లకు కొంత ఊరట లభిస్తుంది. యువ అధికారులు, సిబ్బంది అనవసర ప్రచారం పక్కన పెట్టి, పోలీస్ అధికారులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలని నేను సూచిస్తుంటాను. కెరీర్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం సవాలే.. పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. ఒకవైపు కెరీర్.. మరోవైపు కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద సవాలే. ఆ సమస్య నాకు ఉండేది. నాకు కూతురు, కొడుకు. నేను వాళ్లు స్కూళ్లలో ఉన్నప్పుడు కేవలం ఒక్క సందర్భంలో తప్ప మరెప్పుడూ వాళ్ల స్కూల్‌కి వెళ్లలేదు. వాళ్లు ఏం చదువుతున్నారో.. ఎలా చదువుతున్నారో తెలియదు. కానీ, నా భార్యనే అన్ని విషయాలు చూసుకునేది. అందుకే ఏ విషయంలోనైనా నాపై కుటుంబపరమైన ఒత్తిడి లేకుండా చూసుకునేది. ఏ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడేవాడిని. ప్రజా క్షేమం కోసం పనిచేస్తా.. ప్రభుత్వం నన్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించింది. కొంత విరామం తర్వాత బాధ్యతలు తీసుకుంటాను. అయితే, నాకు ఏ బాధ్యత ఇచ్చినా వ్యవస్థ పురోగతి కోసం పనిచేస్తాను. గతంలో చేసినట్లుగానే సంస్థలను బలోపేతం చేసేందుకు కృషిచేస్తా. నన్ను సడెన్‌గా బదిలీ చేసినా బాధపడలేదు... పోలీసు అధికారిగా రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు ఏనాడూ నేను పట్టించుకోలేదు. పనిగట్టుకుని కొందరు చేసే విమర్శలు పట్టించుకునేవాడిని కాదు. హాయిగా నవ్వుకునే వాడిని. గత ప్రభుత్వంలో కూడా నన్ను ఇంటెలిజెన్స్ నుంచి అకస్మాత్తుగా బదిలీ చేసినప్పుడు కూడా బాధపడలేదు. బదిలీ చేసిన కారణాలు తెలిసి నవ్వుకున్నా. ఆ బదిలీపై ఆ రోజు మా ఇంట్లో వాళ్లు అడిగితే కూడా నేను.. ‘నాకు ప్రెజర్ పోయింది. చాలా హాయిగా ఫీల్ అవుతున్నా..’అని చెప్పా. ఏ బాధ్యత ఇచ్చినా నిజాయితీగా పనిచేశాను. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్‌రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
తెలంగాణ ఇంటెలిజెన్స్ అధిపతిగా శివధర్ రెడ్డి!
విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్‌రెడ్డిని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్‌కు అటాచ్ చేస్తూ డీజీపీ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే విశాఖపట్నం రేంజ్ డీఐజీ సి. ఉమాపతికి నగర పోలీసుల కమిషనర్‌గా అదనపు బాధ్యతులు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింటెడ్ డే. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పేషీలోకి తీసుకునే అధికారుల విషయంలోనూ కసరత్తు మొదలుపెట్టారు. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు వీలుగా అనువైన అధికారుల ఎంపికపై కేసీఆర్ దృష్టిసారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ముఖ్యమంత్రి పేషీలోకి ముఖ్య కార్యదర్శి, ఇతర కార్యదర్శులు, కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, నిఘా విభాగాధిపతి, సైబరాబాద్ కమిషనర్ తదితర కీలక పోస్టులకు సమర్థులైన అధికారుల కోసం ఆయన ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర కేడర్‌లో పనిచేసిన వారు, రాష్ర్టం నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లిన అధికారుల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. అందులోభాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శివధర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డిని బదిలీ చేస్తు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమితులవుతున్నట్లు సమాచారం. -
పార్కింగ్ స్థలంలో నిర్మాణాలపై ఆందోళన
అల్లిపురం, న్యూస్‌లైన్ : జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్లో పార్కింగ్ స్థలాన్ని యథాతధంగా ఉంచాలని హోల్‌సేల్ విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, కొణతాల వీర్రాజు డిమాండ్ చేశారు. కమిషనర్ శివధర్‌రెడ్డికి సమస్యను విన్నవించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వర్తకులు శనివారం పోలీసు కమిషనరేట్‌కు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కొంతసేపు గేటు ముందు ఆందోళన చేశారు. మహారాణిపేట జోన్ సీఐ ఆర్.మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యాపారులను కమిషనర్ వద్దకు తీసుకువెళ్లారు. షాపుల నిర్మాణంపై హై కోర్టులో స్టే ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతున్నారని వారు కమిషనర్‌కు తెలిపారు. పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలకటమే కాకుండా దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హోల్‌సేల్ మార్కెట్ బంద్ చేశామని, తమకు న్యాయం జరిగే వరకు మార్కెట్ తెరిచేది లేదని స్పష్టం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి, న్యాయవాది కొనతాల ప్రతాప్, పొలమర శెట్టి వెంకట సత్యనారాయణ, కోరిబిల్లి ప్రసాద్, పి.సత్తిబాబు, ఎం.రామకృష్ణ, ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు ఉన్నారు.


