ఎన్నో కీలక వ్యూహాలతోనే నక్సలిజం అంతం | DGP B Sivadhar Reddy Exclusive Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ఎన్నో కీలక వ్యూహాలతోనే నక్సలిజం అంతం

May 1 2026 12:43 AM | Updated on May 1 2026 1:07 AM

DGP B Sivadhar Reddy Exclusive Interview With Sakshi

సీఎంగా రాజశేఖరరెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు సహా ఎన్నో పథకాలు ఇందుకు దోహదపడ్డాయి

పోలీసు పోస్టింగ్‌ల్లో గతంతో పోలిస్తే రాజకీయ జోక్యం తగ్గింది... రాజకీయ విమర్శలు నేనెప్పుడూ పట్టించుకోలేదు..  

ప్రజలకు మనమెంత చేరువైతే అన్నిసమస్యలు తగ్గుతాయి... పబ్లిసిటీ కోసం కాకుండా పబ్లిక్‌ కోసం పోలీసింగ్‌ ఉండాలి 

భద్రతా సలహాదారుగా కూడా నాకిచ్చిన బాధ్యతలు నెరవేరుస్తా 

‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్‌ ఐపీఎస్‌ బి.శివధర్‌రెడ్డి 

మొదట్లో నక్సలిజం అనేది కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం చూసింది. కానీ ఇది సామాజిక, రాజకీయ కోణాలు, ఆర్థిక అసమానతలు, సిద్ధాంతాలతో ఇమిడి ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగానే చర్యలు ప్రారంభించింది.

సాంకేతికతను వాడుతూనే బేసిక్‌ పోలీసింగ్‌ను మరవొద్దు. కేవలం సీసీటీవీలు, టెక్నాలజీపైనే ఆధారపడకుండా ప్రజలతో మమేకమైతేనే పోలీసింగ్‌ మరింత మెరుగ్గా ఉంటుంది.  

2025లో హత్యలతో 800 మంది చనిపోతే రోడ్డు ప్రమాదాల్లో 2,500 మందికిపైగా చనిపోయారు. అకారణంగా ఏటా ఇంత మంది చనిపోవడం బాధాకరం. పని మీద బయటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి?

పబ్లిసిటీ కోసం మన పనులు ఉండొద్దు. పబ్లిక్‌ కోసం పనిచేస్తే పబ్లిసిటీ అదే వస్తుందన్న విషయాన్ని మరవొద్దు.  

పోలీసులకు ఇంటిగ్రిటీ ముఖ్యం..ఎవరూ చూడనప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండాలి. హీరోయిజం కోసం కాకుండా రియల్‌గా సేవచేయాలి.  

సాక్షి, హైదరాబాద్‌: బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్లడంతోనే నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసి.. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ, మహిళా రిజర్వేషన్ల కల్పన, ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సైతం ప్రజలపై ప్రభావం చూపాయని.. ఈ అంశాలు సైతం నక్సలిజం అంతానికి దోహదపడ్డాయని చెప్పారు.

ఐపీఎస్‌ అధికారిగా విధుల్లో చేరినప్పటి నుంచి డీజీపీగా పదవీ విరమణ పొందే వరకు వృత్తిగతంగా ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు. డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమితులైన సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో శివధర్‌రెడ్డి మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. 

వ్యూహాత్మక నిర్ణయాలతోనే... 
నక్సలిజం ఎంతో ప్రభావంతంగా ఉన్న పరిస్థితిని నుంచి తాజా పరిస్థతుల వరకు అన్ని స్థాయిల్లో నేను చూశాను. మొదట్లో నక్సలిజాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం చూసింది. కానీ ఇది సామాజిక, రాజకీయ కోణాలు, ఆర్థిక అసమానతలు, సిద్ధాంతాలతో ఇమిడి ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్నాక అందుకు తగ్గట్టుగానే చర్యలు ప్రారంభించింది. తొలుత ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ను స్థాపించడం.

1993లో తెచ్చిన సరెండర్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ పాలసీ, స్థానిక సంస్థల్లో బీసీ, మహిళా రిజర్వేషన్లతో కొన్ని వర్గాలు రాజకీయంగా ఎదగడం, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అడ్డుకునేందుకు తెచ్చిన ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ యాక్ట్‌ పక్కాగా అమలు చేయడంతో ఆ వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగడం.. పెత్తందారుల ఒత్తిళ్లు తగ్గడం.. ఇలా రాజకీయ, సామాజిక మార్పులతో చాలా వర్గాలు నక్సలిజానికి దూరమయ్యాయి. మరోవైపు పోలీసు ఆపరేషన్లు పెరగడంతో 2007 నాటికే తెలంగాణలో మావోయిజం తగ్గింది. అప్పుడప్పుడు ఉనికి చాటుకున్నా.. యాక్టివిటీ ఏమీ లేదు. ఆ తర్వాత వేగంగా క్షీణించింది.  

వైఎస్సార్‌ కీలక నిర్ణయాలతో ప్రభావం 
2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వృద్ధులు, బీడీ కారి్మకులు, వికలాంగులకు పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ పథకం ఇలా అనేక నిర్ణయాలూ సమాజంలో మార్పు తెచ్చాయి. ప్రభుత్వాలు మనకోసం పనిచేస్తున్నాయి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అ లాంటప్పుడు నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాలన్న ప్రశ్న ప్రజల్లో వచ్చింది. అది కూడా నక్సలిజం అంతానికి పనిచేసింది.  

డీజీపీగా రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిచ్చా.. 
నేను డీజీపీగా ఏడు నెలల్లో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు ఫెయిర్, ఫర్మ్, ప్రొఫెషనల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. అన్నింటితోపాటు నేను రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. దీంతో ఈ ఏడాదిలో నాలుగు నెలల్లో 400 రోడ్డుప్రమాద మరణాలు తగ్గించాం. 

రాజకీయ జోక్యం తగ్గిస్తున్నాం 
పోలీసుల పోస్టింగ్‌లు, రోజువారీ పనుల్లో గతంతో పోలిస్తే రాజకీయ జోక్యం తగ్గిస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సు లెటర్స్‌ ఇచ్చినంత మాత్రాన వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. ఆ అధికారి సమర్థత, గతంలో చేసిన సర్విస్‌ను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ ఆ అధికారి సమర్థుడు కాకపోతే వెంటనే సదరు ప్రజాప్రతినిధికి చెబుతున్నాం. గతంతో పోలిస్తే పోలీసు విధుల్లో, కేసుల నమోదులో రాజకీయ జోక్యం బాగా తగ్గించగలిగాం.  

ప్రజలకు అందుబాటులో ఉండాలి.. 
పోలీసు అధికారి కాగానే మనం ఏదో సాధించేశాం అన్నట్టుగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎన్నో సమస్యలతో బాధితులు మన దగ్గరికి వస్తుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం మన పరిధిలో ఉండకపోవచ్చు. అయినా సరే వాళ్ల సమస్యను సావధానంగా వినాలి. అప్పుడు వాళ్లకు కొంత ఊరట లభిస్తుంది. యువ అధికారులు, సిబ్బంది అనవసర ప్రచారం పక్కన పెట్టి, పోలీస్‌ అధికారులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలని నేను సూచిస్తుంటాను.  

కెరీర్, కుటుంబాన్ని బ్యాలెన్స్‌ చేయడం సవాలే.. 
పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. ఒకవైపు కెరీర్‌.. మరోవైపు కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం పెద్ద సవాలే. ఆ సమస్య నాకు ఉండేది. నాకు కూతురు, కొడుకు. నేను వాళ్లు స్కూళ్లలో ఉన్నప్పుడు కేవలం ఒక్క సందర్భంలో తప్ప మరెప్పుడూ వాళ్ల స్కూల్‌కి వెళ్లలేదు. వాళ్లు ఏం చదువుతున్నారో.. ఎలా చదువుతున్నారో తెలియదు. కానీ, నా భార్యనే అన్ని విషయాలు చూసుకునేది. అందుకే ఏ విషయంలోనైనా నాపై కుటుంబపరమైన ఒత్తిడి లేకుండా చూసుకునేది. ఏ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడేవాడిని.  

ప్రజా క్షేమం కోసం పనిచేస్తా.. 
ప్రభుత్వం నన్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించింది. కొంత విరామం తర్వాత బాధ్యతలు తీసుకుంటాను. అయితే, నాకు ఏ బాధ్యత ఇచ్చినా వ్యవస్థ పురోగతి కోసం పనిచేస్తాను. గతంలో చేసినట్లుగానే సంస్థలను బలోపేతం చేసేందుకు కృషిచేస్తా.  

నన్ను సడెన్‌గా బదిలీ చేసినా బాధపడలేదు... 
పోలీసు అధికారిగా రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు ఏనాడూ నేను పట్టించుకోలేదు. పనిగట్టుకుని కొందరు చేసే విమర్శలు పట్టించుకునేవాడిని కాదు. హాయిగా నవ్వుకునే వాడిని. గత ప్రభుత్వంలో కూడా నన్ను ఇంటెలిజెన్స్‌ నుంచి అకస్మాత్తుగా బదిలీ చేసినప్పుడు కూడా బాధపడలేదు. బదిలీ చేసిన కారణాలు తెలిసి నవ్వుకున్నా. ఆ బదిలీపై ఆ రోజు మా ఇంట్లో వాళ్లు అడిగితే కూడా నేను.. ‘నాకు ప్రెజర్‌ పోయింది. చాలా హాయిగా ఫీల్‌ 
అవుతున్నా..’అని చెప్పా. ఏ బాధ్యత ఇచ్చినా నిజాయితీగా పనిచేశాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement