హైదరాబాద్ : కేరళ పేరు చెప్పగానే ప్రకృతి సౌందర్యం కళ్ల ముందు కదులుతుంది.. సంస్కృతి, సంప్రదాయాలు, హిల్ స్టేషన్లు, కొండలు లోయలు,అడవులు, బీచ్‌లు, కొబ్బరి తోటలు, రిసార్టులు ఒక్కటేమిటి కేరళ అందాలను వర్ణించాలంటే మాటల్లో సాధ్యం కాదు.
దేవుడు నివసించే దేశంగా పిలుచుకునే ఆ ప్రాంతం పర్యాటకులను ఆహ్వానిస్తోంది. వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతులతో పాటు ఆరోగ్యం ప్రసాదించే కేరళ.. గత ఏడాది ట్రావెల్, లీజర్ ఇండియా ఉత్తమ వెల్‌నెస్ గమ్యస్థాన అవార్డు సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్ పేరిట వినూత్న ప్రచారానికి కేరళ టూరిజం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన బీటూబీ టూరిజం మీట్‌లో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ సమాచార అధికారి సూరజ్ పాల్గొని మాట్లాడారు.


