విశాఖ మెట్రోపై విదేశీ సంస్థల ఆసక్తి

బిడ్లకు గడువు పొడిగింపునకు ఏఎంఆర్‌సీ సుముఖత

సాక్షి, విశాఖపట్నం: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో ఒకింత కదలిక కనిపిస్తోంది. తక్కువ వడ్డీకి అప్పు పుట్టక, రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాక ​ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇటీవల దక్షిణ కొరియా బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) నేతృత్వంలోని విశాఖ మెట్రో రైలు (వీఎంఆర్‌) ప్రాజెక్టుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గత జూన్‌ 16న నోటిఫికేషన్‌ జారీ చేసింది. జులై 7న గ్లోబల్‌ టెండర్ల దాఖలుకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. అక్టోబర్‌ 12న ప్రీబిడ్‌ నిర్వహించింది. అనంతరం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. తొలుత డిసెంబర్‌ 15, ఆ తర్వాత జనవరి 25 వరకు గడువు విధించింది. అయితే గడువు పెంచాలని కొన్ని సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరి ఆఖరు వరకు పొడిగించేందుకు సుముఖంగా ఉంది.

దాదాపు 15 సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో విదేశీ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో సీమెన్స్‌ జర్మనీ, ఆల్‌స్టాంఫ్రాన్స్, హుండాయ్‌ అండ్‌ బాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దక్షిణ కొరియా, మిట్సుయి జపాన్, అన్‌సాల్టో ఇటలీ, ప్రసారణ మలేసియా, భారత్‌ నుంచి ఎల్‌అండ్‌టీ, అదానీ, ఐఎల్‌ఎస్‌ ముందుకొచ్చాయి. రూ.8,800 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 53, ప్రైవేటు వాటా 47 శాతం కాగా ప్రభుత్వ వాటా రూ.4,600 కోట్లు సమకూర్చాల్సి ఉంది. మిగిలినది కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పెట్టుబడి పెడుతుంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయం అవుతున్నందున ఈ ప్రాజెక్టును 34 సంస్థలు కన్సార్టియంగా ఏర్పాటై చేపట్టాల్సి ఉంటుంది. ఆయా సంస్థల అభ్యర్థన మేరకు బిడ్ల స్వీకరణకు మరికొన్నాళ్ల సమయం ఇవ్వనున్నామని ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వీటిని పరిశీలించాక తుది జాబితాను తయారు చేస్తారు. తర్వాత రెండో దశలో టెండర్లు పిలిచి ఖరారు చేస్తారు. ఇందుకు నాలుగైదు నెలల సమయం పడుతుంది.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top