'చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి'

విజయవాడ: అవినీతి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం బాధగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. స్వదేశీ సంపదను హవాలా రూపంలో సింగపూర్ తరలించి అక్కడ హోటళ్లు నిర్మించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. అవినీతి గురించి ప్రశ్నించే ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి హితవు పలికారు. అవినీతి ఆస్తులు పంచుతాననడం సంతోషమే, కానీ ముందు తను తరలించిన హవాలా ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంచాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. జూన్ 3,4 తేదీల్లో మంగళగిరిలో జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టనున్న సమర దీక్షను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలు, ప్రజలకు సూచించారు.
శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ అభ్యర్థి జి. అదిశేషగిరిరావు సమావేశమయ్యారు. టీడీపీ మహానాడులో శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డిపై విధంగా స్పందించారు. ఈ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ... టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ జాతీయ పార్టీ కాదు... ఉప ప్రాంతీయ పార్టీనే అని కొడాలి నాని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలతో రైతులను, మహిళలను బాబు మోసం చేసి అధికారంలోకి వచ్చారని ... ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కవని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
కృష్ణాజిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ నటుడు జి. కృష్ణ సోదరుడు జి అదిశేషగిరిరావుని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదిశేషగిరిరావు విజయం సాధించేందుకు విజయసాయిరెడ్డి, కొడాలి నాని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.