ఏకీకృత సర్వే ముసుగులో 1.40 కోట్ల కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమస్త సమాచారం సేకరిస్తున్న బాబు సర్కారు
పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది?
కరెంట్ ఎన్ని యూనిట్లు వాడతారు?
రాజకీయ దురుద్దేశాలతోనే సర్వేకు శ్రీకారం
ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సమస్తం తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించనుంది. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సాక్షి, అమరావతి: ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారం సమస్తం గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆధార్ కార్డుల్లో పౌరుల సమగ్ర సమాచారం ఉన్నప్పటికీ ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీయడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయంగా వినియోగించుకోవాలనే దుర్బుద్ధితోనే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారనే సందేహాలు ముసురుకుంటున్నాయి.
పెన్షన్లు, రేషన్ కార్డులు, స్కాలర్‌షిప్‌లు ట్రాకింగ్..!
ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత సమాచాన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే ద్వారా ఇంటింటికి వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకీకృత కుటుంబ సర్వే ఆధారంగా ‘స్మార్ట్ ఫ్యామిలీ’ కార్డు జారీ చేయనున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, స్కాలర్‌షిప్‌లు, కుల ధృవీకరణ, ఇతర పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలను ఫ్యామిలీ కార్డు ద్వారా ట్రాకింగ్ చేయనున్నారు.

డేటా లేక్‌లో నిక్షిప్తం
ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా కులం, మతం, పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది? తదితర వివరాలతో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. వివిధ వర్గాల నుంచి ఇలా తీసుకున్న వ్యక్తిగత సమాచారాన్ని రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌లో నిక్షిప్తం చేయనున్నారు. సర్వే ప్రశ్నావళి చూస్తుంటే కచ్చితంగా ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇప్పటికే ఆధార్‌తో పాటు రేషన్ కార్డుల్లో పౌరుల సమాచారం ఉండగా కొత్తగా ఏకీకృత కుటుంబ సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలను సేకరించాల్సిన అవసరం ఏముందని పేర్కొంటున్నాయి. కొత్తగా రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు క్యూఆర్ కోడ్‌తో ఫ్యామిలీ కార్డు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సర్వే ద్వారా సమాచారం సేకరించాక కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఐదు వర్గాలుగా విభజించనున్నారు.


