కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం` | Ys jagan mohan reddy's samaikya sankharavam yatra from today | Sakshi
Sakshi News home page

కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`

Nov 30 2013 3:07 AM | Updated on Jul 25 2018 4:09 PM

కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం` - Sakshi

కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానుంది.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే బహిరంగ సభ ద్వారా సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడ్నుంచి కుప్పం చేరుకుంటారు.   ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో  జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
 వైఎస్ మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు. తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు.

Advertisement
 
Advertisement
Advertisement