మంత్రులు, అధికారులు.. ఉరుకులు, పరుగులు

మంత్రులు, అధికారులు.. ఉరుకులు, పరుగులు


ఇంతకుముందు సాయంత్రం 6 గంటలైతే చాలు.. లక్నోలోని సచివాలయం మొత్తం బోసిపోయినట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత మంత్రులు, అధికారులు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. పెద్ద పదవుల్లో, పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నామని ఇన్నాళ్ల బట్టి హాయిగా కూర్చున్న పెద్ద మనుషులంతా ఇప్పుడు ఆయాసపడుతూ అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట రావడం పాపం.. వెనువెంటనే దాన్ని పాటించక తప్పడం లేదు. మంత్రులు కూడా ఇదివరకటిలా అధికారాన్ని అనుభవించడం కాకుండా, తమ తమ శాఖల కార్యదర్శులతో నిత్యం చర్చలలో మునిగిపోవాల్సి వస్తోంది. రాత్రి 11 గంటలకు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఫైళ్లు పట్టుకుని అధికారులు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఏ నిమిషంలో ఆయన ఏ సమాచారం అడుగుతారో తెలియకపోవడంతో.. ప్రతి ఫైలూ సమావేశానికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమావేశాలు కూడా చాలా ఎక్కువ సేపు కొనసాగుతున్నాయి.ఇంతకుముందులా సాయంత్రం 6 గంటలకు బయల్దేరి ఇళ్లకు వెళ్లి టీవీలు చూస్తూ జంక్ ఫుడ్ తినడానికి వీల్లేకపోవడంతో ఉన్నతాధికారులకు సైతం పొట్టలు కరుగుతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి వాళ్లకూ బాధ్యతలను అప్పగిస్తూ, ఆ పని పూర్తయ్యేవరకు వాళ్లే చూసుకునేలా చేస్తున్నారు. మొదటి వందరోజులకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయిస్తూ, వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు ఏం వేస్తారో సిద్ధం చేసుకు రమ్మని చెబుతున్నారు.తొలి వందరోజుల పాలన పూర్తయిన తర్వాత బాగా పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని, అలాగే పని ఎగ్గొట్టేవారు, సరైన ఫలితాలు రాబట్టని వారి మీద మాత్రం చర్యలు తప్పవని చెబుతున్నారు.  ఆ తర్వాత 6 నెలలకు, ఏడాదికి ఒక్కోసారి చొప్పున అందరి మీద సమీక్ష ఉంటుందన్నారు. రాత్రి 11 గంటలకు నిర్వహించిన విద్యాశాఖ సమావేశానికి కేబినెట్ మంత్రి ముకుట్ బిహారీ వర్మను కూడా పిలిపించారు. ప్రస్తుతం విద్యావ్యవస్థ తీరుతెన్నులు, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లాంటి ముఖ్యమైన అంశాలను చర్చించారు. వంద రోజుల్లోగా ఫీజులను ఒక కొలిక్కి తేవాలని ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు బాధ్యత అప్పగించారు. రోజుకు కనీసం 18-20 గంటలు పనిచేసేవాళ్లే తనకు కావాలని ఇటీవల గోరఖ్‌పూర్‌లో చెప్పిన మాటలను ఇప్పుడు చేసి చూపిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top