న్యూజిలాండ్ లో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.
మెల్ బోర్న్: న్యూజిలాండ్ లో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. వెస్ట్రన్ బే ఆఫ్ ప్లెంటీ జిల్లాలోని మెక్ లారెన్ పార్క్ సమీపంలోని సరస్సులో ఈత దిగి వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు 20 ఏళ్ల వయసు వారని పోలీసులు తెలిపారు. సోమవారం వీరు గల్లంతయ్యారు. గతరాత్రి ఒకరి మృతదేహం లభ్యంకాగా, రెండో విద్యార్థి మృతదేహం మంగళవారం దొరికింది.
తాడు సహాయంతో వీరు సరస్సులోకి దిగారు. తాడు తెగిపోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మృతుల పేర్లు, వివరాలు వెల్లడించలేదు. వీరి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వీరితో మరో ఇద్దరు భారత విద్యార్థులు ఇక్కడికి వచ్చినట్టు న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది. అయితే ఈత రానివారు మెక్ లారెన్ పార్క్ సరస్సులో దిగొద్దని పోలీసులు సూచించారు.