గొప్పలకు పోయి ‘గుట్టు’ విప్పిన ట్రంప్‌ | Trump tweets about Russia, sharing classified information | Sakshi
Sakshi News home page

గొప్పలకు పోయి ‘గుట్టు’ విప్పిన ట్రంప్‌

May 16 2017 7:27 PM | Updated on Aug 25 2018 7:52 PM

గొప్పలకు పోయి ‘గుట్టు’ విప్పిన ట్రంప్‌ - Sakshi

గొప్పలకు పోయి ‘గుట్టు’ విప్పిన ట్రంప్‌

ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా విమానాల పేల్చివేతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని రష్యాకు వెల్లడంచి చిక్కుల్లోపడ్డారు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌..

- మరో వివాదంలో అమెరికన్‌ ప్రెసిడెంట్‌
ఏం జరిగింది? ఈనెల 10వ తేదీన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్రవాద సంస్థ ఐసిస్‌ నుంచి ఎదురవుతున్న సవాళ్లపై కూడా చర్చ జరిగింది.  పాశ్చాత్యదేశాల్లో దాడులకు ఐసిస్‌ పన్నుతున్న కుట్రల గురించి చెబుతూ... నాకు చక్కటి నిఘా సమాచార వ్యవస్థ ఉంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రతిరోజూ నాకు అందుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్‌.

అదే ఊపులో ఇంకాస్త ముందుకెళ్లి... ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా విమానాల పేల్చివేతకు ఐసిస్‌ వ్యూహరచన చేస్తోందని మిత్రదేశం గూఢచర్యం ద్వారా అందించిన సమాచారాన్ని, వారీ కుట్రను ఎక్కడ పన్నారో సిరియాలోని ఆ పట్టణం పేరునూ రష్యా ప్రతినిధులకు వెల్లడించారు.

ఈ విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ఇంతకుమించి కూడా ట్రంప్‌ రహస్య సమాచారాన్ని బయటపెట్టారని, అయితే అమెరికా ప్రయోజనాల దృష్ట్యా తాము దాన్ని వెల్లడించడం లేదని ఆ పత్రిక తెలిపింది. వైట్‌హౌస్‌ దీన్ని ఖండించింది. సమాచారం ఏ విధంగా, ఎవరి నుంచి అందుతుందనే వివరాలను ట్రంప్‌ చెప్పలేదని ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మాస్టర్‌ అధ్యక్షుడిని వెనకేసుకొచ్చారు. అయితే నష్టనివారణ చర్యల్లో భాగంగా వైట్‌హౌస్‌ సీనియర్‌ అధికారులు వెంటనే సీఐఏ, ఎన్‌ఎస్‌ఏలకు ఫోన్లు చేసి మాట్లాడారు.

అయితే ఏంటి? ఇది అత్యంత రహస్య సమాచారం. అమెరికా అధికార వ్యవస్థలో పైస్థాయిలోని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. సమాచారం ఇస్తున్న వారి గోప్యతను కాపాడే ఉద్దేశంతో... పలు మిత్రదేశాలకు కూడా అమెరికా ఈ సమాచారాన్ని వెల్లడించలేదు.

రష్యా కోణం: హిల్లరీ క్లింటన్, ఇతర డెమొక్రటిక్‌ పార్టీ కీలక సభ్యుల ఈమెయిల్స్‌ను లీక్‌ చేయడం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనేది ఆరోపణ. దీంట్లో రష్యా రాయబారి సెర్గీ క్లిసయాక్‌ పేరు కూడా వినపడింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని ట్రంప్‌ 9వ తేదీన ఆకస్మికంగా పదవి నుంచి తప్పించారు. మరుసటి రోజు రష్యా ప్రతినిధులతో మాట్లాడుతూ రహస్య సమాచారాన్ని చెప్పేశారు.

సిరియాలో ఐసిస్‌కు వ్యతిరేకంగా అమెరికా, రష్యా... రెండూ పోరాడుతున్నాయి. అయితే సిరియా అధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుడిని చేయాలనేది అమెరికా మిత్రదేశాల వాదన. కానీ పుతిన్‌ అందుకు ససేమిరా అంటూ... రష్యా సైనిక బలగాలను అసద్‌కు మద్దతుగా మొహరించారు. చిరకాల ప్రత్యర్థి అయిన రష్యాకు ట్రంప్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మొదటినుంచీ ఉన్నాయి. రష్యాతో ట్రంప్‌ సంబంధాలపై స్వతంత్ర విచారణ జరగాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ దిశగా నైతికంగా, న్యాయపరంగానూ వైట్‌హౌస్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

పర్యవసానాలు:
సమాచారాన్ని ఇస్తున్న వారి గోప్యతను కాపాడటంలో అమెరికా సమర్థతపై సందేహాలు తలెత్తుతాయి.
ఐసిస్‌పై గుట్టుమట్లు తెలిసిన వర్గాల నుంచి వస్తున్న రహస్య సమాచారం ఇకపై ఆగిపోవచ్చు.
గూఢచారులను కనిపెట్టేందుకు ఐసిస్‌ వేట మొదలుపెడితే ప్రాణనష్టం ఉంటుంది.
భవిష్యత్తులో జరిగే దాడులను పసిగట్టడంలో అమెరికా, దాని మిత్రదేశాల అవకాశాలను దెబ్బతీస్తుంది.
అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి అత్యంత రహస్య సమాచారాన్ని కాపాడకపోతే ప్రపంచ దేశాల్లో అమెరికా పలుచన అవుతుంది. విశ్వసనీయత దెబ్బతింటుంది. ఇతర దేశాలు నమ్మకంతోనే నిఘా సమాచారాన్ని అమెరికాతో పంచుకుంటాయి. ఆ నమ్మకం దెబ్బతింటే కష్టం.
పైగా ఇది అమెరికా నిఘావర్గాలు సేకరించిన సమాచారం కాదు... వేరొకరితో పంచుకోవడానికి. ఏదైనా సమాచారాన్ని ఒక దేశం ఇస్తున్నపుడు దాని అనుమతి లేకుండా... సదరు సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు.
గోప్యత కొరవడితే సీఐఏ, ఎన్‌ఎస్‌ఏలలో పనిచేస్తున్న అధికారుల సై్థర్యం దెబ్బతింటుంది.
దేశాధ్యక్షుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్‌ ట్వీట్‌: అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలను రష్యాతో పంచుకున్నాను... తీవ్రవాదం, విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కొన్ని వాస్తవాలను చెప్పాను. అలా చెప్పే సంపూర్ణ అధికారం నాకుంది. మానవతాదృక్పథంతో చేశా. పైగా ఐసిస్‌పై, తీవ్రవాదంపై రష్యా తమ పోరును తీవ్రతరం చేయాలని నేను కోరుకుంటున్నాను.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement