బోనమెత్తిన గోల్కొండ | Telangana Bonala celebrations at Golconda fort | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన గోల్కొండ

Jul 20 2015 1:59 AM | Updated on Sep 3 2017 5:48 AM

అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకువెళుతున్న మంత్రులు నాయిని, పద్మారావు, బోనమెత్తిన మహిళలు

అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకువెళుతున్న మంత్రులు నాయిని, పద్మారావు, బోనమెత్తిన మహిళలు

‘అమ్మా బెలైల్లినాదో.. నా తల్లీ బెలైల్లినాదో..’ అంటూ గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఊరేగింపుతో తెలంగాణ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

* ప్రారంభమైన బోనాల ఉత్సవాలు
* పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు నాయిని, పద్మారావు
* అమ్మవారికి కల్లుకుండతో సాక

 
హైదరాబాద్: ‘అమ్మా బెలైల్లినాదో.. నా తల్లీ బెలైల్లినాదో..’ అంటూ గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఊరేగింపుతో తెలంగాణ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం చారిత్రక గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి ఆషాడమాసంలో మొదటి పూజ చేసి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. లంగర్‌హౌస్‌లో రాష్ట్రప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు అమ్మవారికి అధికారిక లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు.
 
 పట్టువస్త్రాలతో పాటు అమ్మవారి మొదటి బోనం(నజర్  బోనం), ఒక్కొక్కటీ 15 మీటర్ల ఎత్తు ఉన్న 40 తొట్టెలను ఊరేగింపుగా కోటకు తీసుకెళ్లారు. చోటాబజార్‌లో అమ్మవారి ఉత్సవమూర్తులకు పూజారులు దిగంబరరావు ఇంట్లో పూజలు నిర్వహించి బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఆడపడుచులు బోనాలు తీసుకురాగా అక్కడి నుండి పల్లకిలో అమ్మవారిని ఊరేగిస్తూ గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారి వద్దకెళ్లారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుండి గోల్కొండ కోట వరకు ఆడపడుచులు అడుగడుగునా అమ్మవారికి సాక సమర్పిస్తూ స్వాగతం పలికారు. అమ్మవారి తమ్మునిగా చెప్పబడే పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, యువకుల చిందులు ఊరేగింపులో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. పలువురు ముస్లిం సోదరులు బోనాల ఊరేగింపునకు పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొని ఐకమత్యాన్ని చాటారు.
 
 ప్రభుత్వమే నిర్వహిస్తుంది: నాయిని
 బోనాల ఉత్సవాలను పూర్తి బాధ్యతతో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అమ్మవారు శాంతించి పిల్లలను, తోటి వారిని చల్లంగ చూడాలని కోరుతూ ఎన్ని కష్టాల్లో ఉన్నా అమ్మవారికి ప్రజలు సంతోషంగా బోనాలు సమర్పిస్తారని, పలు గ్రామాల నుంచి ప్రజలు నగరానికి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ముందుముందు మరింత వైభవంగా బోనాల వేడుకలు నిర్వహిస్తామన్నారు.
 
 కల్లు సాక సమర్పించిన పద్మారావు
 కల్లు కుండను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చి జగదాంబికా అమ్మవారికి సాక సమర్పించి అందరినీ ఆకట్టుకున్నారు ఆబ్కారీ మంత్రి పద్మారావు. అమ్మవారికి కల్లును సాక గా సమర్పించడం ఆనవాయితీ అని, అందుకే ఈసారి తాను కల్లు సాక సమర్పించానని పద్మారావు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల వేడుకలను ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇకపై సొంత రాష్ట్రంలో మన పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు కోయల్‌కర్ గోవింద్‌రాజ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నేతలు కావూరి వెంకటేష్, జీవన్‌సింగ్ ఈ వేడుకలను నిర్వహించారు. ప్రారంభ వేడుకల్లో బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, దైవజ్ఞశర్మ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement