
నైట్‌ఫ్రాంక్ సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేసిన హెచ్‌ఎండీఏ
గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు రోప్‌వేపై అధ్యయనం
మూడు నెలల్లో నివేదికను అందజేయనున్న కన్సల్టెన్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోనే మొట్టమొదటి రోప్ వే నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శ్రీకారం చుట్టింది. చారిత్రక నగరంలో పర్యాటకులకు ఆహ్లాదకరమైన ఆకాశయాన సదుపాయాన్ని అందజేసేందుకు గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు 1.5 కి.మీ. మార్గంలో రోప్‌వే నిరి్మంచనున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసేందుకు నైట్‌ఫ్రాంక్ సంస్థ కన్సల్టెన్సీగా ఎంపికైంది. రైట్స్, నైట్ ఫ్రాంక్, కెఅండ్‌జే అనే మూడు సాంకేతిక సంస్థలు కన్సల్టెన్సీ హోదాను దక్కించుకొనేందుకు పోటీపడగా నైట్‌ఫ్రాంక్‌కు అవకాశం లభించింది.
సాంకేతిక సామర్ధ్యం, సంస్థ అనుభవం పరిగణనలోకి తీసుకొని కన్సల్టెన్సీనికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థ మూడు నెలల్లో నివేదికను అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి అర్హత కలిగిన సంస్థను ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. పబ్లిక్‌ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని హెచ్ ఎండీఏ భావిస్తోంది. రోప్‌వే నిర్మాణం సాకారమైతే ఈ రెండు చారిత్రక ప్రదేశాలను పర్యాటకులు కేబుల్‌కార్‌లలో సందర్శించే అవకాశం లభించనుంది.
అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం....
ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న రోప్‌వేలపైన నైట్‌ఫ్రాంక్ సంస్థ అధ్యయనం చేయనుంది. నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సామర్ధ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సమర్ధవంతమైన నిర్మాణ సంస్థలను కూడా సూచించనుంది. అలాగే నిర్మాణవ్యయం పైన కూడా అంచనాలను రూపొందిస్తుంది. ప్రస్తుతంగోల్కొండ కోట నుంచి గోల్కొండ టూంబ్స్ మధ్య రక్షణ శాఖకు చెందిన స్థలాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రోప్‌వే నిర్మాణానికి రైట్ ఆఫ్ వేను రూపొందించడంతో పాటు, అవసరమైన వనరులసేకరణపైన కూడా ఈ అధ్య యనం దృష్టి సారించనుంది. అన్ని అంశాలపైన సమగ్రమైన అధ్యయనంతో డీపీఆర్‌ను రూపొందించనుంది. ఈ డీపీఆర్ ఆధారంగానే పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఆహ్లాదం...అనందం..
ప్రస్తుతం మన దేశంలో మనాలి, గ్యాంగ్‌టక్, ఉదయ్‌పూర్, నలందా, డార్జిలింగ్, సిమ్లా, ముస్సోరి తదితర 12 ప్రాంతాల్లో రోప్ వేలు అందుబాటులో ఉన్నాయి. అడవులు, ఎత్తైన కొండప్రాంతాలు, పర్వతమాలలను కలిపే ఆకాశయానాలుగా రోప్‌వేలు వినియోగంలో ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం నగరంలోనే ఆకాశహరŠామ్యల నడుమ ఈ రోప్‌వే సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రతిరోజు సుమారు 10 వేల మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తున్నారు. వారిలో సుమారు 3000 మందికి పైగా విదేశీ టూరిస్టులు ఉన్నట్లు అంచనా. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా చాలామంది గోల్కొండ కోట నుంచే వెనుదిరుగుతున్నారు.
దీంతో గోల్కొండ కోటలాగే ఎంతో చరిత్ర కలిగిన శతాబ్దాల నాటి కుతుబ్‌షాహీల సమాధులను సందర్శించలేకపోతున్నారు. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే 1.5 కి.మీ.మార్గాన్ని కేవలం 10 నిమిషాల్లో చేరుకొనే సదుపాయం లభించనుంది. పైగా రెండు చారిత్రక ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.100 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్వహించడం వల్ల పర్యాటకుల నుంచి టిక్కెట్‌ల రూపంలో ఆదాయం లభించనుంది. ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయితే గోల్కొండ ప్రాంతం మరిన్ని పర్యాటక హంగులను సంతరించుకోనుంది.