
గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి
కృష్ణా, గోదావరిలో శాశ్వత హక్కులు సాధిస్తాం.. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు కొందరి కుట్రలు
ఎవరెన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తాం
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విజన్ 2047 పత్రం
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన..
స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గోల్కొండ కోటలో ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. జలాల్లో శాశ్వత హక్కులు సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తాం. ప్రజల దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్‌ను రగిలించాలని కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడతాం. అందుకోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోల్కొండ కోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి దాదాపు గంటపాటు ప్రసంగించారు. గత పాలకులు రూ.లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఆ నిధులు గోదాట్లో కలిసిపోయినా, ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాకున్నా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపామని సీఎం తెలిపారు.
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన..
రాష్ట్రంలో 20 నెలల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. మా ఆలోచనలో స్పష్టత, పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని ఎంచుకుని 20 నెలల్లోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన. రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం.
ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద 70,11,184 మంది రైతులకు సాయం అందించాం. 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి చివరి గింజ వరకు కొన్నాం. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతు సంక్షేమానికి రూ.1.13 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాం.
సమగ్ర కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రంగం సిద్ధం చేశాం. ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీని ద్వారా వారికి ఇప్పటివరకు రూ.6,790 కోట్లు ఆదా అయ్యాయి. 20 నెలల్లోనే దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని సీఎం వివరించారు.
రాష్ట్రంలో డ్రగ్స్‌కు తావులేదు
గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగిందని సీఎం ఆరోపించారు. ఆ కుట్రను తాము ఛేదించామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిషితంగా నిఘా పెట్టిందని తెలిపారు.
గేమ్ ఛేంజర్‌గా తెలంగాణ..
ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని సీఎం తెలిపారు. ‘2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణను నిలిపేలా కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ లక్ష్యం దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్¯ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్‌లో విస్పష్టంగా ఉండబోతోంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌ను సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణమయ్యే ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ పురోగతికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో చెప్పబోతున్నాం. డిసెంబర్ నాటికి దాన్ని ఆవిష్కరిస్తాం’అని సీఎం తెలిపారు.
హైడ్రా అద్భుతంగా పని చేస్తోంది
హైదరాబాద్ నగరంలో హైడ్రా అద్భుతంగా పనిచేసి కబ్జాకు గురైన చెరువులను పునరుద్ధరిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైడ్రాను ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ అప్పులు, బకాయిలను తీర్చేందుకు తన ప్రభుత్వం రూ.2.20 లక్షల కోట్లు చెల్లించిందని, ఆ అప్పులే లేకుంటే ఈ మొత్తం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసేవాళ్లమని అన్నారు. దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకుని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌లో పెట్టుబడుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అమరావతితో ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, రైలు కారిడార్‌తోపాటు అక్కడి పోర్టులతో అనుసంధానం, ఇక్కడ డ్రైపోర్టుల నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు వివరించారు.
ఘనంగా వేడుకలు...
గోల్కొండ కోటలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం ఉదయం 10 గంటలకు కోట వద్దకు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రసంగం అనంతరం పోలీసు సేవా పతకాలను ప్రదానం చేశారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.కోటి నజరానా అందించారు. ఈ సందర్భంగా కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కాగా, కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు రావటంతో గోల్కొండ కోట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.