26 వివాదాస్పద జీవోలపై స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరణ | Supreme court dismisses special leave petition on 26 controversial GO's | Sakshi
Sakshi News home page

26 వివాదాస్పద జీవోలపై స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరణ

Aug 6 2013 12:41 AM | Updated on Jul 6 2019 12:52 PM

26 వివాదాస్పద జీవోలపై స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరణ - Sakshi

26 వివాదాస్పద జీవోలపై స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరణ

సీబీఐ కేసులో వివాదాస్పదమైన 26 ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి వాటిని జారీ చేసిన ఆరుగురు మంత్రులపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.

సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కేసులో వివాదాస్పదమైన 26 ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి వాటిని జారీ చేసిన ఆరుగురు మంత్రులపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. న్యాయవాది పి.సుధాకరరెడ్డి దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ విషయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
 
  సీబీఐ దర్యాప్తు తీరుపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే విచారణ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది. వివాదాస్పద జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు గత ఏడాది మార్చిలో ఆరుగురు మంత్రులకు - జె.గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయా జీవోలు జారీ అయినపుడు వీరంతా దివంగత వైఎస్ మంత్రివర్గంలో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నారు. ‘సుప్రీం’ నోటీసులకు వారు సమాధానం ఇస్తూ.. ఆ 26 వివాదాస్పద జీవోల జారీకి మొత్తం మంత్రివర్గానిదే ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.
 
 తాము ఎలాంటి విధివిధానాలనూ ఉల్లంఘించలేదని చెప్పారు. ఆయా ఉత్తర్వులను జారీ చేసేముందుగా మంత్రివర్గంలో చర్చించామని.. కాబట్టి ఆ ఉత్తర్వుల జారీకి ఏ ఒక్క మంత్రినీ వ్యక్తిగతంగా తప్పుపట్టజాలరని వాదించారు. ఈ ఆరుగురు మంత్రులతో పాటు.. రెవెన్యూ, పురపాలక, పెట్టుబడులు - మౌలికవసతులు, పరిశ్రమలు - వాణిజ్యం, సాగునీటి శాఖల కార్యదర్శులుగా పనిచేసిన 8 మంది ఐఏఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్ (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు), సి.వి.ఎస్.కె.శర్మ, ఎం.శామ్యూల్, వై.శ్రీలక్ష్మి, ఆదిత్యనాథ్‌దాస్, కె.రత్నప్రభ, బి.శ్యాంబాబ్, మన్మోహన్‌సింగ్‌లకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 
 జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి.. పలువురు ఇతరులపై అనేక కేసులు నమోదు చేసిన సీబీఐ.. తన ఎఫ్‌ఐఆర్‌లో ఈ 14 మంది మంత్రులు, అధికారుల్లో ఎవరి పేరూ చేర్చలేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం - వివిధ సంస్థల మధ్య కుదిరిన 26 ఒప్పందాలకు బాధ్యులు వీరేనన్నారు. వీరిపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలంటూ పిటిషనర్ సుధాకర్‌రెడ్డి తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దానిని ఆ కోర్టు తిరస్కరించటంతో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పిటిషన్ కొట్టివేయటంతో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి.. సీబీఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదులు ఉన్నట్లయితే విచారణ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement