కేరళలోకి ప్రవేశించిన నైరుతి | Southwest monsoon hits Kerala | Sakshi
Sakshi News home page

కేరళలోకి ప్రవేశించిన నైరుతి

Jun 6 2015 3:49 AM | Updated on Sep 4 2018 5:16 PM

కేరళలోకి ప్రవేశించిన నైరుతి - Sakshi

కేరళలోకి ప్రవేశించిన నైరుతి

వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. అరేబియా సముద్రంలో ప్రతికూల పరిస్థితులను...

రుతుపవనాల్లో చురుకుదనం
మరో రెండ్రోజుల్లో ఏపీలోకి ప్రవేశం!
నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి

సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/న్యూఢిల్లీ: వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. అరేబియా సముద్రంలో ప్రతికూల పరిస్థితులను నెమ్మదిగా అధిగమిస్తూ శుక్రవారం ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1నే ఇవి కేరళను తాకుతాయి.

ఈ ఏడాది అండమాన్ సముద్రంలో వారం రోజుల ముందుగానే (మే 14న) నైరుతి ప్రవేశించింది. దీంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రుతుపవనాలు మే 30 నాటికే (నాలుగు రోజులు అటూ ఇటుగా) కేరళను తాకుతాయని తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత జూన్ 5న తాకవచ్చని సవరించుకుంది. గత రెండ్రోజులుగా పశ్చిమ, నైరుతి గాలుల ఉధృతి, కేరళలోని 14 వర్షపాత కేంద్రాల్లో 70 శాతం స్టేషన్లలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ నమోదు కావడంతో శుక్రవారం కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ ప్రకటించింది.

ప్రస్తుతం ఇవి దక్షిణ మధ్య అరేబియా సముద్రం, లక్ష ద్వీప్, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, ఆగ్నేయ, ఈశాన్య, మధ్య బంగాళాఖాతాల్లోకి విస్తరిస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లోకి ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు కేరళను తాకిన ఐదారు రోజులకుగాని ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించవు.

కానీ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం వల్ల రెండు రోజుల్లోనే రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి బలంగా ఉండడం, దానికి ఉపరితల ఆవర్తనం తోడు కావడం, కోస్తా, రాయలసీమల్లో అనుకూల పరిస్థితులు ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు.  నైరుతి రుతుపవనాలు గత ఏడాదిలో జూన్ 6న కేరళను తాకాయి.
 
విస్తారంగా వర్షాలు.. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమల్లో రుతుపవనాలకు ముందు కురిసే వానలు, విదర్భ నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ  తెలిపింది.
 
తెలంగాణలో వర్షాలు.. రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో తెలంగాణను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.  గత 24 గంటల్లో (గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు) తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో అత్యధికంగా 8 సెం.మీ వర్షం కురిసింది.
 
రైతులకు విద్యుత్, విత్తన సబ్సిడీ
ఈసారి తక్కువ వర్షాలతో పంటలు దెబ్బతినే పరిస్థితి వస్తే రైతులకు డీజిల్, విద్యుత్, విత్తనాలపై సబ్సిడీ అందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఐఎండీ అధికారులతో భేటీ అయ్యారు. ‘వర్షాభావం ఏర్పడితే గతేడాదిలాగే రైతులకు ఈసారి కూడా డీజిల్, విద్యుత్, విత్తనాలపై సబ్సిడీ అందిస్తాం. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధం’ అని భేటీ అనంతరం మంత్రి తెలిపారు. లీటరు డీజిల్‌పై రూ.10 సబ్సిడీ, విత్తనాలపై 50 శాతం సబ్సిడీ, రైతులకు ఉచితవిద్యుత్‌ను ప్రభుత్వం కొనసాగించవచ్చని అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement