breaking news
Kerala coast
-
నేడు అండమాన్‌లోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మంగళవారం (13వ తేదీ) సాయంత్రానికి అండమాన్–నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అండమాన్–నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం అండమాన్–నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.ఖమ్మంలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. -
కేరళలోకి ప్రవేశించిన నైరుతి
రుతుపవనాల్లో చురుకుదనం ♦ మరో రెండ్రోజుల్లో ఏపీలోకి ప్రవేశం! ♦ నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/న్యూఢిల్లీ: వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. అరేబియా సముద్రంలో ప్రతికూల పరిస్థితులను నెమ్మదిగా అధిగమిస్తూ శుక్రవారం ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1నే ఇవి కేరళను తాకుతాయి. ఈ ఏడాది అండమాన్ సముద్రంలో వారం రోజుల ముందుగానే (మే 14న) నైరుతి ప్రవేశించింది. దీంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రుతుపవనాలు మే 30 నాటికే (నాలుగు రోజులు అటూ ఇటుగా) కేరళను తాకుతాయని తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత జూన్ 5న తాకవచ్చని సవరించుకుంది. గత రెండ్రోజులుగా పశ్చిమ, నైరుతి గాలుల ఉధృతి, కేరళలోని 14 వర్షపాత కేంద్రాల్లో 70 శాతం స్టేషన్లలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ నమోదు కావడంతో శుక్రవారం కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం ఇవి దక్షిణ మధ్య అరేబియా సముద్రం, లక్ష ద్వీప్, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, ఆగ్నేయ, ఈశాన్య, మధ్య బంగాళాఖాతాల్లోకి విస్తరిస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లోకి ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు కేరళను తాకిన ఐదారు రోజులకుగాని ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించవు. కానీ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం వల్ల రెండు రోజుల్లోనే రాష్ట్రాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి బలంగా ఉండడం, దానికి ఉపరితల ఆవర్తనం తోడు కావడం, కోస్తా, రాయలసీమల్లో అనుకూల పరిస్థితులు ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు గత ఏడాదిలో జూన్ 6న కేరళను తాకాయి. విస్తారంగా వర్షాలు.. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమల్లో రుతుపవనాలకు ముందు కురిసే వానలు, విదర్భ నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వర్షాలు.. రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో తెలంగాణను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. గత 24 గంటల్లో (గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు) తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో అత్యధికంగా 8 సెం.మీ వర్షం కురిసింది. రైతులకు విద్యుత్, విత్తన సబ్సిడీ ఈసారి తక్కువ వర్షాలతో పంటలు దెబ్బతినే పరిస్థితి వస్తే రైతులకు డీజిల్, విద్యుత్, విత్తనాలపై సబ్సిడీ అందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఐఎండీ అధికారులతో భేటీ అయ్యారు. ‘వర్షాభావం ఏర్పడితే గతేడాదిలాగే రైతులకు ఈసారి కూడా డీజిల్, విద్యుత్, విత్తనాలపై సబ్సిడీ అందిస్తాం. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధం’ అని భేటీ అనంతరం మంత్రి తెలిపారు. లీటరు డీజిల్‌పై రూ.10 సబ్సిడీ, విత్తనాలపై 50 శాతం సబ్సిడీ, రైతులకు ఉచితవిద్యుత్‌ను ప్రభుత్వం కొనసాగించవచ్చని అధికారులు చెప్పారు.