ఇంకాస్త దిగొచ్చిన రిటైల్ ధరలు | Sakshi
Sakshi News home page

ఇంకాస్త దిగొచ్చిన రిటైల్ ధరలు

Published Thu, Feb 13 2014 1:19 AM

ఇంకాస్త దిగొచ్చిన రిటైల్ ధరలు - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్ ధరల వేగం వరుసగా రెండవ నెల జనవరిలో కూడా తగ్గింది. నవంబర్‌లో 11.16 శాతం ఉన్న రేటు- డిసెంబర్‌లో 9.87 శాతానికి పడగా, తాజాగా జనవరిలో మరింత కిందకు దిగి 8.79 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన ఆయా నెలల్లో ధరల పెరుగుదల రేటు కిందకు తగ్గుతూ వచ్చిందన్నమాట. జనవరి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి. మొత్తంగా చూస్తే- ఆహారం, ఆల్కాహాలేతర పానీయాల ధరలు 9.9 శాతం పెరిగాయి.

 ఇంధనం, లైట్ విభాగానికి సంబంధించి ద్రవ్యోల్బణం 6.54 శాతంగా నమోదయ్యింది. దుస్తులు, పాదరక్షలు, బెడ్డింగ్ కేటగిరీలో ఈ పెరుగుదల రేటు 9.18 శాతంగా ఉంది. నిత్యావసర వస్తువుల్లో చమురు, కొవ్వు పదార్థాలు (-0.35 శాతం), చక్కెర (-5.51 శాతం) మినహా దాదాపు అన్ని విభాగాల్లో రేట్లు పెరిగాయి.

 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో...
 కాగా జనవరిలో  పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.43 శాతంగా నమోదుకాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 8.09 శాతంగా  ఉంది. డిసెంబర్‌లో ఈ రేట్లు వరుసగా 10.49 శాతం, 9.11 శాతంగా ఉన్నాయి. ఇదిలావుండగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేపు (14వ తేదీ శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement