
రఘువీరా సంచలన వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)ను చంద్రబాబే హత్యచేశారని రఘువీరా రెడ్డి ఆరోపించారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. చంద్రబాబు పేరు చెప్పకుండా.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)ను ఆయన అల్లుడు చంద్రబాబే హత్యచేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి తర్వాతి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
‘ఎన్టీఆర్ హత్యకు గురై 21 సంవత్సరాలు అవుతోంది. ఆయన అల్లుడు చంద్రబాబే ఆ పని చేశారు. అప్పట్లో ఔరంగజేబు పదవుల కోసం సొంతవాళ్లను చంపేశాడు. చంద్రబాబు కూడా ఔరంగజేబు లాంటివారేన’ని రఘువీరా వ్యాఖ్యానించారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ విషయంలోనూ టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆదివారం మాట్లాడిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి.. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం’ ఫైలు ప్రధాని టేబుల్ మీద ఉందని చెప్పడం పచ్చి అబద్ధమని రఘువీరా అన్నారు. ‘ఇప్పటికి టీడీపీ ఎన్నిసార్లు ఎన్టీఆర్‌కు భారతరత్న తీర్మానం చేసింది? చిత్తశుద్ధితో ప్రయత్నించారా? ఎన్టీఆర్ ఫైలు ప్రధాని టేబుల్ మీద ఉంటే, ఇక తీర్మానం అవసరం ఏముంది? అసలు ప్రధాని ముందున్నది ఎన్టీఆర్ ఫైలా? లేక చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలనే ఫైలా? లేకుంటే సుజనా బ్యాంకుల వ్యవహారం ఫైలా? ఇంకా ఎన్నాళ్లు ప్రజల్ని మోసం చేస్తారు?’ అని రఘువీరా మండిపడ్డారు.