పార్లమెంటు ఉభయ సభలు సోమవారం సమావేశమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.
అనుకున్నట్లే అవుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వర్షార్పణం అయిపోయేలాగే కనిపిస్తున్నాయి. మూడు రోజుల విరామం అనంతరం సోమవారం సమావేశమైన పార్లమెంటు ఉభయ సభలు కొద్ది సేపటికే మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.
లోక్సభ సమావేశం కాగానే ముందుగా కేరళలో సోలార్ స్కాం, జమ్ములో జరుగుతున్న మతఘర్షణలు, కర్ఫ్యూ తదితర పరిస్థితులు, తెలంగాణ తదితర అంశాలపై పలు పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ముందుగానే చెప్పినట్లు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తీరాలంటూ నినాదాలు చేశారు. దీంతో లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
అటు రాజ్యసభలోనూ ఇవే అంశాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రధానంగా జమ్ము అల్లర్లు అక్కడ గందరగోళానికి కారణమయ్యాయి. అయితే తొలుత కేవలం పదిహేను నిమిషాల పాటు వాయిదా వేసినా, తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో రాజ్యసభను కూడా సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.