నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణ | Modi Govt to Revamp Nehru Museum, Cong Cries Foul | Sakshi
Sakshi News home page

నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణ

Sep 3 2015 12:56 AM | Updated on Mar 18 2019 9:02 PM

నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణ - Sakshi

నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణ

గాంధీ స్మృతి, లలిత కళా అకాడెమీ, నెహ్రూ స్మారక మ్యూజియం, గ్రంథాలయం(ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్) సహా 39 ప్రముఖ సంస్థలను పూర్తిస్థాయిలో...

మోదీ ప్రభుత్వ నిర్ణయం; కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ: గాంధీ స్మృతి, లలిత కళా అకాడెమీ, నెహ్రూ స్మారక మ్యూజియం, గ్రంథాలయం(ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్) సహా 39 ప్రముఖ సంస్థలను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని కేంద్రం నిర్ణయించింది. సమకాలీన ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబించేలా వాటిలో మార్పులు చేస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కూడా అందులో భాగంగా ఉంటాయని, తద్వారా ఆ సంస్థలను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.  

ఆ సంస్థల స్థాపన ఉద్దేశాలు కొనసాగుతాయని అన్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌తీవ్రంగా స్పందించింది. అది క్రూరమైన ఆలోచన అని, దాన్ని ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేసింది. ఆ నిర్ణయం దేశ వారసత్వ, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే ఆయా సంస్థల స్ఫూర్తిని, ఖ్యాతిని పలుచన చేసే కుట్ర అని పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ‘ఎలాంటి ఘన వారసత్వ చరిత్రా లేని బీజేపీ, ఆరెస్సెస్‌లు స్వాతంత్య్ర పోరాటమనే ఘన వారసత్వ చరిత్రను తప్పుగా, అసంబద్ధంగా పునర్లిఖించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

వలస పాలనపై పోరాటానికి, స్వాతంత్య్రానంతరం లౌకిక, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశంగా భారత్ రూపాంతరం చెందడానికి ప్రతీకగా నిలిచిన ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్‌లో మార్పులు చేయాలనే ఆలోచన దారుణం. మ్యూజియం అంటేనే గత చరిత్రకు సాక్ష్యం. దాన్ని సమకాలీనతకు ప్రతిబింబంగా ఎలా మారుస్తారు? ప్రభుత్వ ప్రచార సాధానాలుగా ఎలా వాడుకుంటారు?’ అని  ప్రశ్నించారు.  

కాంగ్రెస్ ఆరోపణలను మంత్రి మహేశ్ శర్మ కొట్టిపారేశారు. నెహ్రూని కానీ, ఆయన ఆలోచనలను తక్కువ చేసే ఆలోచన తమకు లేదన్నారు. ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్‌కు సంబంధించినంత వరకు ఆ భవనం, ఆడిటోరియం, గ్రంథాలయాలను నూతనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయా సంస్థల పేర్లు మార్చే ఆలోచన కూడా లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement