గృహ రుణాల్లో భారీ వృద్ధి నమోదుపై ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
చెన్నై: గృహ రుణాల్లో భారీ వృద్ధి నమోదుపై ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ మేరకు శుక్రవారం పరిమిత కాలపు ప్రత్యేక వడ్డీరేట్ల ఆఫర్లను ప్రకటించాయి. తమ ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపాయి. వివరాలివీ...
ఇండియన్ బ్యాంక్: 10.20 శాతం వడ్దీరేటుకు గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా ఈ వడ్డీరేటు మార్చి వరకూ అమల్లో ఉంటుంది.
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్: ఇక ఐఓబీ విషయానికి వస్తే - మహిళలు లక్ష్యంగా బ్యాంక్ ప్రత్యేక పథకాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా శుభ గృహ పథకం కింద 10.25 శాతం వడ్డీపై గృహ రుణాన్ని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇతర రుణ గ్రహీతలకు సంబంధించి రూ.75 లక్షల వరకూ రుణ రేటు 10.25 శాతం వరకూ ఉంటుంది. రూ.75 లక్షలు దాటితే ఈ రేటు 10.50 శాతం.
ఐఓబీ ‘కనెక్ట్ కార్డ్’
కాగా యువత లక్ష్యంగా ఐఓబీ శుక్రవారం ‘కనెక్ట్ కార్డ్’ను ఆవిష్కరించింది. ఇది ఏటీఎం వినూత్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్. వీసా భాగస్వామ్యంతో బ్యాంక్ ఈ కార్డును ఆవిష్కరించింది. దాదాపు ఐదు లక్షల దుకాణాల్లో ఈ-కామర్స్‌కు అవకాశం కల్పించడం ఈ కార్డు ప్రత్యేకం. ఐఓబీ కస్టమర్లు అందరికీ ఈ కార్డును అందిస్తున్నప్పటికీ, 10 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్కులకు సేవలు అందజేయడం దీని ప్రధాన లక్ష్యమని బ్యాంక్ ప్రకటన తెలిపింది. ఈ-షాపింగ్, ఈ-పేమెంట్ విధానం ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకూ (మార్చి వరకూ) ఐదుశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సౌలభ్యాన్ని సైతం బ్యాంక్ అందిస్తోంది. కాగా ప్రత్యేకించి సప్లై చైన్ భాగస్వాముల ఫైనాన్సింగ్‌కు వీలు కల్పించే ‘చానెల్ ఫైనాన్సింగ్’ వ్యవస్థను సైతం ఐఓబీ ఆవిష్కరించింది. కార్పొరేట్, వ్యవస్థాగత, చిన్న-మధ్యతరహా రుణ కస్టమర్ల ప్రయోజనాలకు దీన్ని ఉద్దేశించారు.