30 లక్షల ఎకరాలు మునక.. రూ.3,252 కోట్ల నష్టం | Heavy rains cause Rs. 3,252 crore loss to farmers | Sakshi
Sakshi News home page

30 లక్షల ఎకరాలు మునక.. రూ.3,252 కోట్ల నష్టం

Nov 5 2013 2:17 AM | Updated on Jun 4 2019 5:04 PM

వారం రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాలు రైతన్న వెన్ను విరిచాయి. గతనెల 21 - 27 తేదీల మధ్య సంభవించిన వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఇటీవలి వర్షాలు, వరద నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక  
 సాక్షి, హైదరాబాద్ : వారం రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాలు రైతన్న వెన్ను విరిచాయి. గతనెల 21 - 27 తేదీల మధ్య సంభవించిన వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో అన్నదాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. 17.29 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడికి గండి పడిందని వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదిక నిగ్గుతేల్చింది. పంట నష్టాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు వ్యవసాయ శాఖ పంపిన ప్రాథమిక నివేదిక ‘సాక్షి’కి లభించింది.

దీని ప్రకారం 19 జిల్లాల్లోని 701 మండలాల్లో రూ. 3,252.37 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. ముఖ్యంగా తెల్లబంగారంగా పేరొందిన పత్తి పంటను సాగు చేసిన రైతులు నిలువునా నష్టాల్లో మునిగిపోయారు.16.16 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. 4.97 లక్షల టన్నుల పత్తి తడిచి నాని ఎందుకూ పనికిరాకుండాపోయింది. దీంతో రూ.1991.54 కోట్ల నష్టం వాటిల్లింది. సాగు ఖర్చులు విపరీతంగా పెరగడంవల్ల గిట్టుబాటు కావడంలేదని బాధపడుతున్న వరి రైతులను కూడా ఈ వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. 12.47 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఈ కారణంగా 8.17 లక్షల టన్నుల మేరకు వరి దిగుబడి పడిపోనుంది. పంటనష్టం రూ.1099 కోట్లు పైమాటే. ఇక మొక్కజొన్న, వేరశనగ, పెసర, చెరకు, కంది తదితర అనేక పంటల దిగుబడికి నష్టం వాటిల్లింది.

 

జిల్లాలవారీగా పరిశీలిస్తే.. నల్లగొండ జిల్లాకు అత్యధిక నష్టం వాటిల్లింది. అత్యధిక విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నదీ, పంట నష్టం వాటిల్లిందీ నల్లగొండ జిల్లాలోనే కావడం గమనార్హం. 5.42 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల 2.02 లక్షల టన్నుల మేరకు దిగుబడి పడిపోగా రూ.626.65 కోట్ల నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో రూ. 422.11 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.393.34 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో రూ.245.92 కోట్ల మేరకు పంట నష్టం జరిగింది.  వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక కంటే రైతులకు జరిగిన నష్టం వాస్తవానికి చాలా ఎక్కువగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులవారీ, పంటల వారీ నష్టాన్ని మదిస్తే ఈ నష్టం రెట్టింపు ఉండే అవకాశం ఉందని అనధికారిక అంచనా.
 
 కేంద్రం స్పందన శూన్యం: వర్షాలు వరదలు రాష్ట్రవ్యాప్తంగా 53 మందిని పొట్టన పెట్టుకున్నాయి. మృతుల సంఖ్య పరంగా, పంట నష్టం పరంగా చూస్తే ఈ వర్షాలు జాతీయ విపత్తుగా భావించక తప్పదు. వారం రోజుల వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా ప్రధాని మన్మోహన్‌గానీ, వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌గానీ కనీసం ఏరియల్ సర్వేకు కూడా రాకపోవడాన్ని బట్టే మన రాష్ట్రం పట్ల కేంద్రానికి ఉన్న వివక్ష స్పష్టమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
 
 అపార నష్టం.. ఉదారంగా ఆదుకోండి: సీఎం
 రాష్ట్రవ్యాప్తంగా గత నెల 21 నుంచి 27 వరకూ కురిసిన వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లిందని, తక్షణమే స్పందించి ఉదారంగా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నష్టంపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపగా ఉదారంగా ఆదుకోవాలంటూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు సీఎం కిరణ్ లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement