breaking news
state disaster
-
పెనుభూకంపం ముందుందా?
డెహ్రాడూన్: హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పెనుభూకంపం అతలాకుతలం చేయనుందా? రాష్ట్రంలో గత రెండేళ్లుగా స్వల్పస్థాయిలో సంభవిస్తున్న భూకంపాలు దీన్నే హెచ్చరిస్తున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో త్వరలోనే అత్యంత భారీ భూకంపం విధ్వంసం సృష్టించనుందని ఆ రాష్ట్ర విపత్తు ఉపశమనం, నిర్వహణా కేంద్రం (డీఎంఎంసీ) చీఫ్ పీయూష్ రౌతేలా తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8 కిపైగానే నమోదవ్వొచ్చని చెప్పారు. 2015, జనవరి 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 51 సార్లు భూమి స్వల్పంగా కంపించిందనీ, వీటిని హెచ్చరికలుగానే పరిగణించాల్సి ఉంటుం దన్నారు. ఉత్తరాఖండ్‌లో గత 200 ఏళ్లుగా ఒక్క భారీ భూకంపం కూడా రాలేదన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్–5లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 1803లో చివరిసారిగా సంభవించిన భారీ భూకంపంతో ఉత్తరాఖండ్ అతలాకుతలమైందన్నారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వస్తే ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన ముస్సోరీలో 18 శాతం, నైనిటాల్లో 14 శాతం భవనాలు నేలమట్టమవుతాయని స్పష్టం చేశారు. ఇక్కడి భవనాల్లో చాలావరకూ 1951కి ముందే నిర్మితమమైనవే. -
30 లక్షల ఎకరాలు మునక.. రూ.3,252 కోట్ల నష్టం
ఇటీవలి వర్షాలు, వరద నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక సాక్షి, హైదరాబాద్ : వారం రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాలు రైతన్న వెన్ను విరిచాయి. గతనెల 21 - 27 తేదీల మధ్య సంభవించిన వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో అన్నదాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. 17.29 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడికి గండి పడిందని వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదిక నిగ్గుతేల్చింది. పంట నష్టాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు వ్యవసాయ శాఖ పంపిన ప్రాథమిక నివేదిక ‘సాక్షి’కి లభించింది. దీని ప్రకారం 19 జిల్లాల్లోని 701 మండలాల్లో రూ. 3,252.37 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. ముఖ్యంగా తెల్లబంగారంగా పేరొందిన పత్తి పంటను సాగు చేసిన రైతులు నిలువునా నష్టాల్లో మునిగిపోయారు.16.16 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. 4.97 లక్షల టన్నుల పత్తి తడిచి నాని ఎందుకూ పనికిరాకుండాపోయింది. దీంతో రూ.1991.54 కోట్ల నష్టం వాటిల్లింది. సాగు ఖర్చులు విపరీతంగా పెరగడంవల్ల గిట్టుబాటు కావడంలేదని బాధపడుతున్న వరి రైతులను కూడా ఈ వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. 12.47 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఈ కారణంగా 8.17 లక్షల టన్నుల మేరకు వరి దిగుబడి పడిపోనుంది. పంటనష్టం రూ.1099 కోట్లు పైమాటే. ఇక మొక్కజొన్న, వేరశనగ, పెసర, చెరకు, కంది తదితర అనేక పంటల దిగుబడికి నష్టం వాటిల్లింది. జిల్లాలవారీగా పరిశీలిస్తే.. నల్లగొండ జిల్లాకు అత్యధిక నష్టం వాటిల్లింది. అత్యధిక విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నదీ, పంట నష్టం వాటిల్లిందీ నల్లగొండ జిల్లాలోనే కావడం గమనార్హం. 5.42 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల 2.02 లక్షల టన్నుల మేరకు దిగుబడి పడిపోగా రూ.626.65 కోట్ల నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో రూ. 422.11 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.393.34 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో రూ.245.92 కోట్ల మేరకు పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక కంటే రైతులకు జరిగిన నష్టం వాస్తవానికి చాలా ఎక్కువగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులవారీ, పంటల వారీ నష్టాన్ని మదిస్తే ఈ నష్టం రెట్టింపు ఉండే అవకాశం ఉందని అనధికారిక అంచనా. కేంద్రం స్పందన శూన్యం: వర్షాలు వరదలు రాష్ట్రవ్యాప్తంగా 53 మందిని పొట్టన పెట్టుకున్నాయి. మృతుల సంఖ్య పరంగా, పంట నష్టం పరంగా చూస్తే ఈ వర్షాలు జాతీయ విపత్తుగా భావించక తప్పదు. వారం రోజుల వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా ప్రధాని మన్మోహన్‌గానీ, వ్యవసాయ మంత్రి శరద్పవార్గానీ కనీసం ఏరియల్ సర్వేకు కూడా రాకపోవడాన్ని బట్టే మన రాష్ట్రం పట్ల కేంద్రానికి ఉన్న వివక్ష స్పష్టమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. అపార నష్టం.. ఉదారంగా ఆదుకోండి: సీఎం రాష్ట్రవ్యాప్తంగా గత నెల 21 నుంచి 27 వరకూ కురిసిన వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లిందని, తక్షణమే స్పందించి ఉదారంగా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నష్టంపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపగా ఉదారంగా ఆదుకోవాలంటూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు సీఎం కిరణ్ లేఖ రాశారు.