
అన్ని గౌరవాలూ ఒకే కుటుంబానికా?
తపాలా స్టాంపులు మళ్లీ అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వివాదాన్ని రాజేశాయి...
నెహ్రూపై 7, ఇందిరపై 4, రాజీవ్‌పై 2 స్టాంపులు
* ఒక్కొక్కరిపై ఇన్ని స్మారక స్టాంపులా?
* మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్‌లు కాంగ్రెస్ వారు కారా?
* కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తపాలా స్టాంపులు మళ్లీ అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వివాదాన్ని రాజేశాయి. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల స్టాంపులను కొనసాగించరాదని నిర్ణయం తీసుకున్న కేంద్రం తాజాగా ఇన్‌లాండ్ లెటర్లపైనా ఇందిర స్టాంపును తొలగించాలని నిశ్చయించటంతో బుధవారం కాంగ్రెస్ మండిపడింది.
ఇది చరిత్రకు జరిగిన అవమానమని, మోదీ ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదంపై కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇన్‌లాండ్ లెటర్‌పై ఇందిర స్టాంపుకు బదులు యోగా గుర్తును ముద్రించాలంటూ సలహా కమిటీ సూచించిందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఒకే కుటుంబం అన్ని గౌరవాలను పొందజాలదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘దృష్టి అంతా ఒకే కుటుంబంపై! ఇతర పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. మహాత్మాగాంధీ ఉన్నారు. మౌలానా ఆజాద్ ఉన్నారు.. అంబేడ్కర్ ఉన్నారు. డాక్టర్ భాభా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
తపాలా బిళ్లల సలహా కమిటీ సిఫార్సు మేరకే ‘భారత నిర్మాతలు’ థీమ్‌తో ప్రముఖుల స్టాంపులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కొత్త సిరీస్‌లో వచ్చే స్టాంపుల్లో జవహర్‌లాల్ నెహ్రూ సహా స్వాతంత్య్ర సంగ్రామంలో తమదైన భూమికను పోషించిన అనేకమంది ముఖచిత్రాలు వస్తాయని వివరించారు. తపాలా బిళ్ల అనేది గౌరవానికి ప్రతీక అని.. ఈ గౌరవాన్ని పొందే హక్కు ఒక కుటుంబానికి మాత్రమే ఉండటం సాధ్యం కాదన్నారు.
తాము ప్రస్తుతం తీసుకువస్తున్న స్టాంపుల్లో వివిధ సైద్ధాంతిక మార్గాల్లో ఆధునిక భారత నిర్మాణంలో తమదైన భూమికను పోషించిన ప్రముఖులు ఉన్నారన్నారు. ఇప్పటి వరకు ఇందిరపై స్మారకంగా నాలుగు, రాజీవ్ గాంధీ స్మారకంగా రెండు, నెహ్రూ స్మృతిలో ఏడు స్టాంపులను తీసుకువచ్చారని, ఒక కుటుంబానికి చెందిన సభ్యులపై ఇన్ని స్టాంపులు రావటమేమిటని ప్రశ్నించారు. మౌలానా ఆజాద్ కాంగ్రెస్ వాడు కాదా? మరి ఆయన స్టాంపు ఈ సిరీస్‌లో ఎందుకు తీసుకురాలేదన్నారు.
క్షమాపణ చెప్పాల్సిందే: కాంగ్రెస్
మంత్రి స్పందనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. గాంధీలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, 21ఏళ్లపాటు ప్రధానులుగా ఈ దేశాన్ని పునర్నిర్మించిన వారని పార్టీ ప్రతినిధి ఆనంద్‌శర్మ అన్నారు. ఇది భారత దేశ చరిత్రకే అవమానమని.. ఈ దుర్మార్గానికి పూనుకున్న ప్రభుత్వానికి ఏ కాస్త మర్యాద మిగిలి ఉన్నా దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ వాదనలో అంతా కేవలం నెహ్రూ, గాంధీ కుటుంబంపై , కాంగ్రెస్ పట్ల విరోధం మాత్రమే కనిపిస్తోందని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు.