ఎన్ఐటీనా.. మాకొద్దు: గోవా గ్రామస్థుల నిరసన | Goa villagers oppose technology institute in forest | Sakshi
Sakshi News home page

ఎన్ఐటీనా.. మాకొద్దు: గోవా గ్రామస్థుల నిరసన

Sep 2 2013 3:08 PM | Updated on Sep 1 2017 10:22 PM

గోవాలోని కున్కోలిమ్ గ్రామస్థులు తమకు ఎన్ఐటీ వద్దంటే వద్దని పట్టుబడుతున్నారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఎన్ఐటీ. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ తమ ప్రాంతంలో వస్తోందంటే ఎవరైనా వద్దంటారా? కానీ, గోవాలోని కున్కోలిమ్ గ్రామస్థులు మాత్రం తమకు ఎన్ఐటీ వద్దంటే వద్దని పట్టుబడుతున్నారు. రాజధాని పనజికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఎన్ఐటీ పెట్టడానికి ప్రతిపాదన రావడంతో ఈ ప్రాంతం వాళ్లు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది పెట్టడం వల్ల అటవీ భూమిని తీవ్రంగా కోల్పోవాల్సి వస్తుందని, అందువల్ల ఇది తమకు వద్దంటే వద్దని నొక్కి చెబుతున్నారు. ఈ విద్యాసంస్థకు ఆరు లక్షల చదరపు మీటర్ల స్థలం కేటాయించారని, దాదాపు ఈ ప్రాంతమంతా అడవులతో నిండి ఉండటమే కాక, అపార జీవవైవిధ్యంతో కూడి ఉంటుందని వాళ్లు వాదిస్తున్నారు. దీన్ని కోల్పోవడం ఏమాత్రం సమంజసం కాదని ఎన్ఐటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ సభ్యుడు ఆస్కార్ మార్టిన్స్ తెలిపారు. 
 
భూసేకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గోవాలో ఎన్ఐటీ ఏర్పాటు చేయాలని గత సంవత్సరం తలపెట్టింది. ఉన్నత విద్య కోసం గోవా విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సంస్థ కోసం మొత్తం 12 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించగా, అందులో దాదాపు సగం అటవీ భూమే. కొంత భాగం వ్యవసాయ భూములు కూడా ఉండటంతో స్థానికులు ఎన్ఐటీ ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement