భువనేశ్వర్: గోవా సుందరి సాధ్వీ సతీశ్ సైల్ 2026 సంవత్సరానికి ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన 61వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో దాదాపు 30 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్ తొలి రన్నరప్‌గా, జమ్మూ కశ్మీర్‌కు చెందిన డాక్టర్‌శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు. సాధ్వీ ఆత్మవిశ్వాసం, నిబ్బరం, ఆలోచనల్లో స్పష్టత ఆమెకు కిరీటాన్ని కట్టబెట్టాయి. 75వ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.
సామాజిక సేవలో ముందు
గోవాలో జన్మించిన సాధ్వీ సతీశ్ ఉన్నత విద్య అభ్యసించారు. కెనడాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేశారు. మో డల్‌గా పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించారు. నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టారు. ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. సామాజిక సేవ రంగంలోకీ దిగారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తున్నారు. బధిర చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఫెమీనా మిస్ ఇండియా గోవా–2026 కిరీటం కూడా దక్కించుకున్నారు.


