ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్ | Oracle Shocks IIT NIT Students 50 plus Campus Offers Cancelled AI Job Cuts | Sakshi
Sakshi News home page

ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఒరాకిల్ షాక్

May 15 2026 9:26 AM | Updated on May 15 2026 9:26 AM

Oracle Shocks IIT NIT Students 50 plus Campus Offers Cancelled AI Job Cuts

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఐటీ దిగ్గజం ఒరాకిల్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. వ్యాపార పునర్నిర్మాణం, నియామక అవసరాల్లో మార్పులను సాకుగా చూపుతూ ఇప్పటికే ఎంపికైన విద్యార్థులకు ఇచ్చిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్లను, ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లను (పీపీఓ) సామూహికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో వందలాది మంది మేధావుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఒకే రోజులో 50కి పైగా ఆఫర్లు రద్దు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్ వేదికగా బాధితులు తమ ఆవేదనను పంచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్, ఖరగ్‌పూర్ సహా ఎన్ఐటీలు, బిట్స్ పిలానీ క్యాంపస్‌ల నుంచి విద్యార్థులను ఒరాకిల్ ఎంపిక చేసుకుంది. డే-1 ప్లేస్‌మెంట్‌లోనే ఏడాదికి రూ.35 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీలతో ఈ ఆఫర్లు లభించాయి. అయితే కంపెనీ ఈ నియామకానలు రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో ఇప్పడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్లయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేవలం ఒకే రోజులో వివిధ క్యాంపస్‌ల నుంచి 50కి పైగా ఆఫర్లను కంపెనీ రద్దు చేసింది.

వన్ స్టూడెంట్ - వన్ ఆఫర్

ఐఐటీలు, ఎన్ఐటీలలో కఠినమైన ప్లేస్‌మెంట్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఒక విద్యార్థికి ఒక కంపెనీలో ఉద్యోగం వస్తే ఆ విద్యార్థి తదుపరి వచ్చే ఏ ఇతర కంపెనీ ఇంటర్వ్యూలకు హాజరుకాకూడదు. ‘మేము ఎంతో కష్టపడి డే-1 కంపెనీలో ఆఫర్ సాధించాం. కానీ ఇప్పుడు ఒరాకిల్ ఆఫర్ వెనక్కి తీసుకోవడంతో అటు పాత ఉద్యోగం లేదు.. ఇటు ఇతర కంపెనీలకు దరఖాస్తు చేసే అవకాశం పోయింది. ప్లేస్‌మెంట్ సీజన్ ముగింపు దశకు రావడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’ అని ఒక విద్యార్థి వాపోయారు.

వరంగల్ ఎన్ఐటీ విద్యార్థుల ఆవేదన

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌), వరంగల్ విద్యార్థులు సైతం ఈ ప్రభావానికి బలయ్యారు. అంతర్గత పునర్నిర్మాణం, హెడ్ కౌంట్ మార్పుల వల్ల తన పీపీఓ రద్దు చేసినట్లు ఒక విద్యార్థి లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎన్ఐటీ వరంగల్ ‘సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్’ విద్యార్థుల తప్పిదం లేకపోయినా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఇప్పుడు ఈ విద్యార్థులు స్వతంత్రంగా(ఆఫ్‌ క్యాంపస్‌) ఉద్యోగాలు సాధించాల్సి ఉందని చెప్పింది.

ఏఐ విప్లవం.. ఉద్యోగాల కోత!

ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. అందులో భారతదేశం నుంచి సుమారు 12,000 మంది (40%) ఈ కోతలకు గురయ్యారు. క్లౌడ్, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, ఇంజినీరింగ్, నెట్ సూట్ ఇండియా డెవలప్‌మెంట్ వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు జరిగాయి.

ఇదీ చదవండి: ఉగాండా గతి మార్చిన భారత్‌

Advertisement
 
Advertisement
Advertisement