ఉగాండా గతి మార్చిన భారత్‌ | From Exile to Empire How Uganda Expelled Indians Became the Nation Lifeline | Sakshi
Sakshi News home page

ఉగాండా గతి మార్చిన భారత్‌

May 14 2026 1:46 PM | Updated on May 14 2026 2:13 PM

From Exile to Empire How Uganda Expelled Indians Became the Nation Lifeline

అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.

అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.

90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు

1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్‌లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.

గణాంకాలు ఇలా..

  • 1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.

  • 1972లో 740 మిలియన్ షిల్లింగ్‌లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.

ముసెవెని పిలుపుతో మారిన దశ

1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.

ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణ

తిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

సుధీర్ రుపారేలియా

బహిష్కరణ సమయంలో లండన్‌కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.

మధ్వానీ గ్రూప్

గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.

మెహతా, ముక్వానో గ్రూప్స్

మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎ​ంతో ఎదిగింది.

భారత్ - ఉగాండా సంబంధాలు

ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.

అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్‌ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement