డాక్టర్ కేతన్ భాటికర్ మృతి గోవా రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. గోవా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కేతన్ భాటికర్ పాముకాటుతో మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాల్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. 38 ఏళ్ల కేతన్ భాటికర్ కర్ణాటకలోని దాండేలి గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారు దిగిన సమయంలో పాము కాటేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను గోవాలోని ధర్‌బందోర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా..
గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ కేతన్ భాటికర్.. ఇటీవల రద్దైన పోండా అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైకోర్టు తీర్పుతో ఆ ఉపఎన్నిక రద్దు కావడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషాద ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేతన్ భాటికర్ మరణం వైద్య రంగానికి తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేత యూరి అలెమావో కూడా సంతాపం తెలిపారు. ప్రజాసేవ పట్ల కేతన్ భాటికర్‌కు ఉన్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
ఉప ఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే..
పోండా అసెంబ్లీ ఉపఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే.. ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్‌లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అవసరమైంది. దీంతో ఎన్నికల సంఘం 2026 ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున డాక్టర్ కేతన్ పోటీ చేశారు. అయితే, పోలింగ్‌కు కేవలం 16 గంటల ముందు బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆ ఉపఎన్నికను రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను డాక్టర్ కేతన్.. సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉందని.. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషనర్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
సుప్రీంకోర్టుకు డాక్టర్ కేతన్..
దీనిపై డాక్టర్ కేతన్ భాటికర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యాక రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రచారం పూర్తైంది.. పోస్టల్ బ్యాలెట్లు కూడా పడిపోయాయి. ప్రజలకు తమ ఎమ్మెల్యేను ఎన్నుకునే హక్కు దూరమైంది. చట్టం ఎన్నికలు నిర్వహించకూడదని కాదు.. తప్పనిసరి కాదని మాత్రమే చెబుతోంది. పోండా ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల చట్టంలోని Section 151A వ్యాఖ్యానం కీలకమని పేర్కొంటూ ఎన్నికల సంఘం సమాధానం కోరింది. ఈ క్రమంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఆయన చనిపోయారు. డాక్టర్ కేతన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉండగా.. ఇంతలోనే పాముకాటుతో ఆయన మరణించడం రాజకీయంగా, న్యాయపరంగా కూడా చర్చనీయాంశమైంది.
సుప్రీంకోర్టు నిర్ణయంపై..
అయితే, డాక్టర్ కేతన్ మరణంతో ఆయన దాఖలు చేసిన సుప్రీంకోర్టు పిటిషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగత హక్కులు లేదా ఎన్నికల అర్హతలకు సంబంధించిన కేసుల్లో పిటిషనర్ మరణిస్తే, ఆ పిటిషన్ “అబేట్” (చెల్లుబాటు కోల్పోవడం) అయ్యే అవకాశముంటుంది. అయితే ఇది పూర్తిగా కేసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పోండా ఉపఎన్నిక రద్దు అంశం ప్రజాప్రయోజనం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదిగా కోర్టు భావిస్తే, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ తరఫున మరో వ్యక్తి కేసును కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.


